మోక్షమెప్పుడో..?

5 Jun, 2020 11:55 IST|Sakshi

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు

అధికారుల నిర్లక్ష్యంతో రెండేళ్లు గడిచినా అందని చెక్కులు

పాల్వంచకు చెందిన షేక్‌ ఆలియాకు 2019 ఏప్రిల్‌ 28న వివాహమైంది. ఈమెకు ప్రస్తుతం 10నెలల పాప ఉంది. కానీ ఇప్పటివరకు షాదీముబారక్‌ చెక్కు ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితంలేదు. నగదు మంజూరై ఆర్డీవో పీడీ ఖాతాలో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది.

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఈ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కుటుంబాల్లోని యువతులకు వివాహం చేస్తే ప్రభుత్వం రూ.1,00,116 చొప్పున అందిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ట్రెజరీకి, అక్కడి నుంచి ఆర్డీఓ పీడీ(పర్సనల్‌ డిపాజిట్‌) ఖాతాకు నిధులొచ్చినా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. పెళ్లయిన నెలరోజుల లోపే చెక్కులు అందించాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. కొందరు యువతులకు వివాహమై పిల్లలు జన్మించడంతో పాటు రెండున్నరేళ్లు దాటినప్పటికీ సదరు మొత్తం అందడం లేదు. దీంతో వివాహమై ఇతర జిల్లాలు, ప్రాంతాలకు వెళ్లిన యువతులు ఇబ్బందులు పడుతున్నారు.

రెండేళ్లుగా జాప్యం..
జిల్లాలో 2019–20 సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు 5,661 మంది దరఖాస్తు చేసుకోగా, 174 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 5,487 మందికి సంబంధించిన నగదు ట్రెజరీ ద్వారా ఆర్డీఓ పీడీ ఖాతాకు చేరింది. ఇందులో సుమారు 450 మందికి మాత్రం నెలల తరబడి, కొందరికి ఏడాది, మరికొందరికి ఏడాదిన్నర పైబడినప్పటికీ చెక్కులు అందించకుండా జాప్యం చేస్తున్నారు. 2020–21లో 1,909 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తహసీల్దార్ల వద్ద 283, ఎమ్మెల్యేల వద్ద 193 పెండింగ్‌లో ఉన్నాయి. 3 దరఖాస్తులను తిరస్కరించారు. 1,430 ఎమ్మెల్యేల వద్ద అప్రూవల్‌ అయి ఉన్నాయి. వీటికి సంబంధించిన నగదు ఆర్డీవో పీడీ ఖాతాలో జమ కాలేదు. 2020–21లో కోవిడ్‌–19 కారణంగా ఆలస్యమైనా, 2019–20కి సంబంధించిన చెక్కులు అందకపోవడంతో లబ్ధిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 2017, 2018 వివాహమైన యువతుల్లో కొందరికి ఇప్పటికీ చెక్కులు రాలేదు.

ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కులు ఇచ్చేందుకే జాప్యమా..?
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ 2015లో ప్రారంభం కాగా, మొదట్లో నేరుగా సదరు యువతి ఖాతాలో జమ అయ్యేవి. తర్వాత కాలంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెక్కుల రూపంలో పంపిణీ చేయిస్తున్నారు. ప్రస్తుతం పలువురు లబ్ధిదారులకు సంబంధించి నగదు మంజూరై ట్రెజరీ నుంచి ఆర్డీవో పీడీ ఖాతాలోకి వచ్చినట్లు ఆన్‌లైన్‌లోనూ చూపిస్తోంది. బ్యాంకర్లు చెక్కులు ఇవ్వడంలేదనే కారణంతో వీటి పంపిణీ ఆలస్యం చేస్తున్నారు. కోవిడ్‌–19 సమయంలో ఎక్కువమంది గుమిగూడే అవకాశం లేనందున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడమో లేక వారికి నేరుగా ఇచ్చే అవకాశముంది. కానీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకే తాత్సారం చేస్తున్నారని, ఇదంతా ఎమ్మెల్యేల ప్రచార కండూతి కోసమేననే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ఆర్డీవో కనకం స్వర్ణలతను వివరణ కోరగా... కోవిడ్‌–19 కారణంగా ఆలస్యమవుతోందని తెలిపారు. మరోవైపు మంజూరైనవాటికి సంబంధించి బ్యాంకర్లు చెక్కులు ఇవ్వడంలో జాప్యం కావడంతో పంపిణీ చేయలేదన్నారు.

మరిన్ని వార్తలు