నీటి కొలను.. చింత తీరెను! 

26 May, 2018 04:18 IST|Sakshi
ఖమ్మంలోని ఓ నీటిగుంత

      ఫాంపాండ్స్‌తో రైతన్నలకు ప్రయోజనం

     నీటిగుంతలతో పెరుగుతున్న భూగర్భ జలాలు

     అవసరమున్నప్పుడు మోటార్‌తో చేనుకు నీరు

     మరోవైపు గుంతలు తవ్వుకునేందుకు కొందరు విముఖత

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మాతండాకు చెందిన రైతు బానోత్‌ రాములు ఈయన. ఈజీఎస్‌ పథకంలో భాగంగా మంజూరు చేసిన ఫాంపాండ్‌ (నీటిగుంత)ను సొంతంగానే తవ్వుకున్నాడు. పంటలు ఎండిపోకుండా గుంతల్లోని నీటిని అవసరమైనప్పుడు ఆయిల్‌ ఇంజన్‌తో పెట్టుకొని కాపాడుకుంటున్నాడు. రూ.20 వేలు మాత్రమే ఖర్చు అయిందని తెలిపాడు. నీటిగుంతల వల్ల నీరు భూమిలో ఇంకిపోతోందని, దీంతో పక్కనే ఉన్న బోరులో సైతం నీటి సామర్థ్యం తగ్గలేదని చెప్పుకొచ్చాడు. ఈ పథకంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని ఆనందం వ్యక్తం చేశాడు. 

సాక్షి నెట్‌వర్క్‌: ఫాంపాండ్స్‌ (నీటిగుంతలు) సత్ఫలితాలిస్తున్నాయి. భూగర్భ జలాల పెంపునకు రైతుల పొలాల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన ఫాంపాండ్స్‌తో ప్రయోజనం చేకూరుతోంది. ఈ గుంతలతో వేసవిలో నీటి కొరత తీరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు పని దొరకడంతోపాటు వ్యవసాయ బావులు, బోరు బావుల్లో నీటి నిల్వ పెరుగుతున్నాయి. మరోవైపు పథకం లక్ష్యం.. ఫలాలు బాగానే ఉన్నా అధికారులు ఆచరణలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖల ద్వారా రైతులకు నీటి గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించాల్సి ఉండగా, ఇప్పటికీ ఎలాంటి అవగాహన కల్పించలేదు. దీంతో రాష్ట్రంలో వీటి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మరో పది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో, ఇక ఈ గుంతల నిర్మాణం చేపట్టడం కష్టంగా మారనుంది. వర్షాకాలానికి ముందే నీటి గుంతల నిర్మాణ పనులను పూర్తి చేసేలా అధికారులు పనులను వేగవంతం చేయాల్సి ఉంది. 

అవగాహనా లోపంతో రైతుల వెనుకడుగు 
ఫాంపాండ్స్‌పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. దీంతో కొన్నిచోట్ల వీటిని తవ్వుకునేందుకు విముఖత చూపుతున్నారు. దాదాపు ఒక గుంట మేర ఫాంపాండ్స్‌ను తవ్వుతుండటంతో భూమి వృథాగా పోతుందంటూ ముందుకు రావడం లేదు. మరికొన్ని చోట్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాకు 5,047 గుంతలు మంజూరు కాగా, వీటిలో 2,064 గుంతల పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. కామారెడ్డి జిల్లాలో 8,513 ఫాంపాండ్స్‌ నిర్మించాలన్న లక్ష్యం ఉండగా, 5,344 గుంతల నిర్మాణం ఇప్పటి వరకు మొదలుపెట్టనేలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు 51,345 నీటి గుంతలు మంజూరయ్యాయి. కానీ ఇప్పటి వరకు 484 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో 404 ఫాంపాండ్స్‌ నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో 167 పనులు కొనసాగుతుండగా.. 150 పూర్తయ్యాయి. పనులు సరిగా జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 
గజ్వేల్‌లో నీటిగుంతను తవ్వుతున్న దృశ్యం 

ఫాంపాండ్స్‌ నిర్మాణమిలా.. 
రైతుల భూముల్లో తవ్వాల్సిన ఫాంపాండ్స్‌ ఇలా ఉన్నాయి. 2/2 సైజు సుమారు రూ.6 వేలతో చేపడుతుండగా.. 6/6 సైజు రూ.18,079, 8/8 సైజు రూ.80,795, 20/20 సైజుకు రూ.2.55 లక్షలు వెచ్చి స్తున్నారు. పొడవు, వెడల్పు, లోతు ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. 

అనాసక్తికి కారణాలివీ.. 
- ఎండాకాలం కావడంతో లోతుగా తవ్వాల్సిన నీటి గుంతల పనులకు ఉపాధి హామీ కూలీలు ముందుకు రావడం లేదు. 
- అలాగే చిన్న కమతాలు ఉన్న రైతులు నీటి గుంతకే భూమి మొత్తం పోతే సాగుకు ఏం మిగులుతుందంటూ ఆసక్తి చూపడం లేదు. 
- రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా మరో కారణం.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాశిరెడ్డిగూడేనికి చెందిన రైతు గోదుమగడ్డ మల్లారెడ్డి ఈయన. తనకున్న 9 ఎకరాల భూమిలో మూడెకరాల్లో మొక్కజొన్న, ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. గతంలో సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడేవాడు. ప్రభుత్వం నుంచి గతేడాది ఫాంపాండ్‌ మంజూరైంది. వ్యవసాయ క్షేత్రంలో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు కలిగిన ఫాంపాండ్‌ను నిర్మించారు. అప్పటి నుంచి నీటి సమస్య తీరింది. వేసవిలో రాత్రి వేళ పాండ్‌లో నీటిని నింపుతాడు. చేనుకు ఉదయాన్నే మోటార్‌ ద్వారా నీళ్లు అందిస్తున్నాడు. 

అవగాహన కల్పించాలి 
సరైన అవగాహన లేక నీటిగుంతలు నిర్మించుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదు. నాకున్న ఆరు ఎకరాల్లో మామిడి తోట ఇతర పంటలను సాగు చేశాను. ఉపాధి హామీ ద్వారా నీటిగుంత నిర్మించుకుంటున్నాను. దీంతో భూగర్భ జలాలు పెంపొందించుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి.
– మద్ద మధు, లంబడిపల్లి, చెన్నూరు మండలం, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు