ఇదేం మెలిక !

10 Jan, 2015 03:11 IST|Sakshi
ఇదేం మెలిక !

బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారికే గ్యాస్ సిలిండర్
 
 జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు                          :  5,84,544
 ఏజెన్సీలకు ఆధార్ సీడింగ్ పూర్తయినవి                  :  4,58,992

 బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తయినవి          :  3,14,308
 
పండగపూట కూడా...గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. ఆధార్‌తోపాటు బ్యాంకు ఖాతాలు సమర్పించిన వారికే సిలిండర్లు ఇస్తున్నారు. మూడునెలల దాకా గడువు ఉన్నా జిల్లా అధికారుల తొందరపాటు చర్యల కారణంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.    -నల్లగొండ                         
 
పండగ పూట గ్యాస్ వినియోగదారుల కష్టాలు
 
నల్లగొండ: సంక్రాంతికి ముందుగానే ప్రజలు వంటగ్యాస్ కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పండగ సెలవులు మూడు రోజులు అయినప్పటికి అంతకంటే ముందుగానే రెండో శనివారం, ఆదివారాలు కూడా సెలవు దినాలు కావడంతో పట్టణాల్లో, పల్లెల్లో పండగ వాతావరణం సందడి చేస్తోంది. అయితే సంక్రాంతి రోజున రకరకాల పిండివంటలు చేసుకుద్దామంటే ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెడుతున్నాయి.

జిల్లా అధికారులు అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగదు బదిలీ పథకం అమల్లో భాగంగా వంట గ్యాస్ కనెక్షన్లుకు ఆధార్‌నంబర్లు తప్పని సరిగా సమర్పించాలి. దీంతోపాటు బ్యాంకు ఖాతాల నంబర్లు కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ నెల నుంచే జిల్లాలో నగదు బదిలీ పథకం ఆరంభమైంది.

ఇంతవరకు బాగానే ఉన్నా ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చిన వినియోగదారులకు మాత్రమే ఏజెన్సీలు రీఫిల్ ఇస్తున్నారు. అదేమంటే జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు తాము నడుచుకుంటున్నామని చెబుతున్నారు. దీంతో పండుగపూట ఇంట్లో పొయ్యి వెలిగించలేని పరిస్థితి ఏర్పడింది.
 
అధికారుల తొందరపాటు...
నగదు బదిలీ పథకం ప్రారంభమైన నాటినుంచి మూడు మాసాల్లోగా బ్యాంకు ఖాతాలు ఇచ్చేందుకు కేంద్ర వెసులుబాటు కల్పించింది. కానీ ఏజెన్సీల ఒత్తిడికి తలొగ్గిన జిల్లా అధికారులు బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వినియోగదారులకు మాత్రమే గ్యాస్ రీఫిల్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. గుట్టచప్పుడు కాకుండా జారీ అయిన ఈ ఉత్తర్వులను బయటకు పొక్కనీయకుండా ఏజెన్సీలు తమ ప్రతాపాన్ని వినియోగదారులపై చూపుతున్నాయి.

బ్యాంకు ఖాతాలు ఇవ్వకుండా సిలిండర్ తెచ్చుకునేందుకు వెళ్లిన వినియోగదారులకు ఏజెన్సీలు ఈ ఉత్తర్వులను చూపించి గ్యాస్ ఇవ్వకుండా తిప్పిపంపిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన గడువు మేరకు మార్చి నెలాఖరులోగా వినియోగదారులు బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ సీడింగ్ పూర్తిచేయాలి.

నత్తనడకన ఆధార్ సీడింగ్..
జిల్లాలో మొత్తం 5.84 లక్షల గ్యాస్ కనెక్షన్లకుగాను 4.58 లక్షల కనె క్షన్లు గ్యాస్ ఏజెన్సీలకు అనుసంధానమయ్యాయి. ఇంకా 1,25,552 కనెక్షన్లు ఆధార్ సీడింగ్ చేయాల్సి ఉంది. ఏజెన్సీలు, బ్యాంకు ఖాతాలకు కేవలం 3.14 లక్షల కనెక్షన్లు మాత్రమే సీడింగ్ పూర్తయ్యాయి. ఆధార్ సీడింగ్ పూర్తయి ఏజెన్సీలకు బ్యాంకు ఖాతానంబర్లు ఇవ్వాల్సిన కనెక్షన్లు 1.44 లక్షలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా పూర్తికావడానికి మూడు మాసాల వరకు గడువు ఉంది. కానీ అధికారుల తొందరపాటు చర్య వల్ల ఏజెన్సీలు గ్యాస్ రీఫిల్ ఇవ్వకుండా కొత్త సమస్య సృష్టిస్తున్నారు.

మరిన్ని వార్తలు