నో ట్రబుల్‌!

15 Jan, 2019 10:52 IST|Sakshi

ఇక సకల హంగులతో ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం

గృహప్రవేశాలకు ముందే మౌలిక సదుపాయాలు

తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలకు ప్రాధాన్యం

అంతర్గత  వసతులకు రూ.750 కోట్లు  

సాక్షి, సిటీబ్యూరో: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త. ఇకపై సర్వహంగులు, వసతులు కల్పించాకే ఇళ్లను అప్పగిస్తారు. ఇందుకోసం ముందస్తుగానే మౌలిక సదుపాయాలపై దృష్టిపెడతారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం 109 ప్రాంతాల్లో నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు..ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేనాటికే ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు సైతం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్ల ప్రారంభోత్సవం నాటికి కనీస మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, తదితరమైనవి అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కాలనీల్లోనే కల్పించాల్సిన అంతర్గత మౌలిక సదుపాయాలకు ఒక్కో ఇంటికి రూ. 75 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుండగా,  దూరప్రాంతాల నుంచి కాలనీల వరకు ఆ సదుపాయాలు రప్పించేందుకుగాను అవసరమైన తాగునీటి పైప్‌లైన్లు , విద్యుత్‌ లైన్లు, రహదారుల నిర్మాణంతోపాటు కమ్యూనిటీహాళ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీలు, పాఠశాల భవనాలు, అగ్నిమాపక చర్యలు, పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు తదితరమైన వాటికోసం  అదనపు నిధులు కావాల్సి ఉంది. ఇందుకుగాను అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిదాదాపు రూ.600 కోట్లు ఖర్చుకాగలదని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు..వాటిని ఇప్పించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సదుపాయాలకు గాను ఏ ప్రభుత్వ విభాగానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందో వివరాలిలా ఉన్నాయి.  

అంతర్గత సదుపాయాలకురూ.750 కోట్లు..
డబుల్‌ ఇళ్లకు అవసరమయ్యే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, అంతర్గత రహదారులు, వరదకాలువలు, పార్కులు, మురుగునీటి కాలువలు తదితర మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటికి రూ. 75 వేల వంతున ప్రభుత్వం అందజేస్తుంది. ఇలా లక్ష ఇళ్లకు వెరసి మొత్తం రూ. 750 కోట్లు ఖర్చు కానుంది.  

ఎస్టీపీల ఏర్పాటుకు టెండర్లు..
ఈ నేపథ్యంలో దాదాపు 50 కాలనీల్లో మురుగునీటిని శుభ్రంచేసేందుకు ఎస్టీపీల ఏర్పాటుకు  జీహెచ్‌ఎంసీ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ఇంటరెస్ట్‌(ఈఓఐ) కమ్‌ రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌(ఆర్‌ఎఫ్‌పీ)గా టెండర్లను ఆహ్వానించింది. టెండరు దక్కించుకునే ఏజెన్సీయే ఐదేళ్లపాటు నిర్వహణ పనులు కూడా చేపట్టాల్సి ఉంది.  
గ్రేటర్‌లో  హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధుల్లో జీహెచ్‌ఎంసీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లనిర్మాణం చేపట్టడం తెలిసిందే.లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఈ సంవత్సరంలో పూర్తిచేయాలనేది లక్ష్యం కాగా, ఎస్టీపీలను సెప్టెంబర్‌నాటికే పూర్తిచేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టెండర్ల దాఖలుకు ఈనెల 23 చివరి తేదీ. ఫిబ్రవరిలో పనులు ప్రారంభించి సెప్టెంబర్‌నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో  టెండర్లు ఆహ్వానించారు. ఆయా కాలనీల్లోని ఇళ్ల సంఖ్యను బట్టి వివిధ సామరŠాధ్యలతో ఎస్టీపీలను నిర్మించనున్నారు. వీటిల్లో 0.05ఎంఎల్‌డీ నుంచి 0.50, 1.00, 1.50, 2.00, 2.05, 3.50 , 8.00, 9.50 ఎంఎల్‌డీల సామర్ధ్యమున్నవి ఉంటాయి.  

ఎక్కడెక్కడ..  
ఎస్టీపీలు ఏర్పాటు కానున్న ప్రాంతాల్లో జియాగూడ, భోజగుట్ట, ఫరూక్‌నగర్, ఫలక్‌నుమా,బండరావిర్యాల, ఎల్లమ్మబండ, అబ్దుల్లాపూర్, ఇంజాపూర్, తట్టిఅన్నారం, బాటసింగారం, బాచారం, తిమ్మాయిగూడ, మల్లాపూర్, మాన్‌సాన్‌పల్లి, మంకాల్, కుర్మల్‌గూడ, మొహబత్‌నగర్, నార్సింగి, బైరాగిగూడ, బౌరంపేట, డి.పోచంపల్లి, గాగిల్లాపూర్, దుండిగల్, బహదూర్‌పల్లి, కైసర్‌నగర్, అహ్మద్‌గూడ, కొర్రెముల, జవహర్‌నగర్, రాంపల్లి, నాగారం, ప్రతాపసింగారం, తూముకుంట, మురహరిపల్లి, పోచారం, కొల్లూరు, కర్దనూరు, కిష్టారెడ్డిపేట, ఈదుల నాగులపల్లి, అమీన్‌పూర్‌ తదితర ప్రాంతాలున్నాయి.  

లక్ష ఇళ్ల నిర్మాణానికిరూ.8598.58 కోట్లు..
మొత్తం 109 ప్రాంతాల్లో లక్ష డబుల్‌బెడ్‌రూమ్‌  ఇళ్ల నిర్మాణానికయ్యే వ్యయం: రూ. 8598.58 కోట్లు.
సింగంచెరువు తండాలో ఇళ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరగడం తెలిసిందే.  గాజుల రామారం, అమీన్‌పూర్‌–1,జమ్మిగడ్డ, సయ్యద్‌సాబ్‌కా బాడా  తదితర ప్రాంతాల్లోనూ ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు.

విభాగం    రూ. అంచనా వ్యయం    (రూ.కోట్లలో)
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌    235.40
జలమండలి    158.65
హెచ్‌ఎండీఏ    94.30
విపత్తుల నిర్వహణ,
ఫైర్‌సర్వీసులు    26.16
ఇతరత్రా    85.49

మరిన్ని వార్తలు