‘పెట్టుబడి’ కావాలా.. ఇండియాకు రండి

11 May, 2018 11:04 IST|Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ) : ఏర్గట్ల మండలంలోని తొర్తికి చెందిన జంబుక కాంతయ్య అనే వ్యక్తికి ఎకరం పొలం ఉంది. అయితే ఇక్కడ తక్కు వ భూమి ఉండటంతో ఆ పొలాన్ని తన కుటుంబానికి అప్పగించి గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నాడు. కాంతయ్యకు ఉన్న ఎకరం పొలంలో అతని భార్య లత రెండు సీజనులలో వరి పంటను సాగు చేస్తుంది. పెట్టుబడి సహాయం కింద కాంతయ్య పేరున రూ.4వేల చెక్కును రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. కాంతయ్య మాత్రం గల్ఫ్‌లో ఉండటంతో ఆ చెక్కును అధికారులు ఎవరికి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

కాంతయ్య పేరున మంజూరైన పెట్టుబడి సహాయం చెక్కును అతనికే ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించడంతో వ్యవసాయం చేస్తున్న అతని భార్యకు పెట్టుబడి సహాయం అందే అవకాశం లేదు. కాంతయ్య సొంతూరికి వచ్చిన తరువాతనే పెట్టుబడి సహాయం చెక్కును ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అక్కడ ఎప్పుడు సెలవిస్తారో తెలియదు. ఒక వేళ ప్రభుత్వం విధించిన గడువులోగా కాంతయ్య ఇంటికి రాకుంటే ఆ చెక్కు ప్రభుత్వ రైతునిధికే వెళ్లిపోతోంది.

 కాంతయ్య లాగే ఎందరో...

ఇది ఒక కాంతయ్య పరిస్థితే కాదు గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉపాధి పొందుతున్న ఎంతో మంది చిన్న, సన్నకారు రైతుల స్థితి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంటల సాగుకు పెట్టుబడి సహాయం పథకం ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనల కారణంగా విదేశాల్లో ఉపాధి పొందుతున్న చిన్న, సన్నకారు రైతులు తమ వ్యవసాయానికి పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కోల్పొనున్నారు.

పెట్టుబడి సహాయం చెక్కులు ఎవరి పేరిట వ్యవసాయ భూములు ఉంటే వారికే అందిస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో గల్ఫ్, ఇతర దేశాల్లో ఉపాధి పొందుతున్న రైతులు ఈ సహాయానికి దూరం కానున్నారు. ప్రభుత్వం వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు పెట్టుబడి సహాయం చెక్కును పొందక పోతే మూడు నెలల తరువాత మళ్లీ ఆ చెక్కును రివాలిడేషన్‌ చేసి ఇస్తామని చెబుతున్నారు. కాని మూడు నెలల్లో స్వదేశానికి రాని రైతులకు ప్రభుత్వం సహాయం అందకుండా పోతుంది.

రూ.50వేలు ఖర్చు చేసుకుని..

ఒక వేళ పెట్టుబడి సహాయం కోసం గల్ఫ్‌ నుంచి రావాలంటే కనీసం రూ.50వేలు ఖర్చు పెట్టుకుని ఇంటికి రావాల్సి ఉంటుంది. వచ్చే కొద్దిపాటి సహాయం కోసం వేల ఖర్చును భరించే స్థితిలో విదేశీ రైతులు లేరు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తే తప్ప గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న రైతుల కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందే పరిస్థితి లేదు. 
ప్రభుత్వం స్పందించి గల్ఫ్, ఇతర దేశాల్లో ఉ పాధి పొందుతున్న రైతుల పేరిట అందించే సహా యం విషయంలో ఏదైనా ఆలోచన చేయాలని ప లువురు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నయ మార్గం చూడకుంటే చిన్న, సన్నకారు రైతుల కు టుంబాలు ఎక్కువ సంఖ్యలో నష్టపోనున్నాయి.

గల్ఫ్‌లోనే ఎక్కువమంది.. 
జిల్లాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2,39,712 మంది రైతులు ఉండగా వీరికి రూ.204.44 కోట్ల పెట్టుబడి సహాయం మంజూరయ్యింది. అయితే పెట్టుబడి సహాయం పొందడానికి అర్హులైన రైతుల్లో దాదాపు 20 శాతం మంది గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న రైతులకు పెట్టుబడి సహాయం మంజూరి అయినా వారు ఇంటికి వచ్చిన తరువాతనే సహాయం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ తక్కువ విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉండటంతో ఆ భూమిని కుటుంబ సభ్యులకు అప్పగించిన రైతులు గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులు వ్యవసాయం చేస్తున్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్టుబడి సహాయంను పొందడానికి అర్హత కోల్పొతున్నారు.

మరిన్ని వార్తలు