పర్యాటకులకు లక్న'వరం'

12 Dec, 2015 12:17 IST|Sakshi

సిటీలో వాతావరణం సడెన్‌గా చల్లబడింది. హాలిడే మూడ్ వచ్చేసింది. అయితే ఆహ్లాదకర వాతావరణముంటే చాలదు. అందుకు తగిన పరిసరాలు కూడా ఉంటేనే కదా మనసు వాటితో మమేకమైపోయేది. అలాంటి పరిసరాలు ఉండాలంటే.. కాంక్రీట్ నగరంలో కష్టసాధ్యమే. మరేం చేయాలి? లక్నవరం వెళ్లండి అనేదే సమాధానం.        - ఓ మధు
 
 ఆహ్లాద వాతావరణం, కొండలు, పారే నీరు, తదేకంగా ప్రవాహ గమనాన్ని తిలకిస్తూ ఎంతోసేపు ఉండిపోయేలా అవకాశమిచ్చే వంతెన.. మరోవైపు మనదైన ఏకాంతానికి స్వాగతం పలికే ద్వీపం. ఇలాంటి వాతావరణంలో సేదతీరితే.. ఓహ్.
 
 మదిదోచే నదిలా..
 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఓ చిన్నపాటి నదిని తలపిస్తుంది. సిటీకి దగ్గర్లోనే ఉన్న ఈ ప్రశాంతమైన చోటు ఊహించనంత ఆనంద, ఆశ్చర్యాలను అందిస్తుంది. ఒకప్పుడు పెద్దగా ప్రాధాన్యత లేని ఈ ప్లేస్ ఇప్పుడు ఒక చక్కని టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. వరంగల్ కోట, ఆలయాల తర్వాత లక్నవరానికి అంత ప్రాచుర్యం రావడానికి పర్యాటక శాఖ కృషి ప్రధాన కారణం.
 
 ప్రత్యేక ఆకర్షణలు

-  10 వేల ఎకరాలలో ఉన్న వర్షాధారిత చెరువు. ఇందులో 13 దీవులున్నాయి. బోట్‌లలో విహారం చేస్తూ చెరువంతా చుట్టి రావచ్చు.
-  నదిపై 160 మీటర్ల పొడవైన వేలాడే వంతెన అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి 3 చిన్న చిన్న ద్వీపాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన దీనికి ఎంతో ప్రాముఖ్యతని తెచ్చిపెట్టింది.
- ఇక్కడి అందాలను తనివితీరా చూసి సేదతీరేందుకు హరిత వసతి గృహ సముదాయం కూడా ఉంది.
- కాకతీయులు ఈ చెరువుని గుర్తుంచి తూములు ఏర్పాటు చేశారు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ తూము నేటికీ చూడొచ్చు.
- చలికాలంలో ఇక్కడికి అనేక రకాల వలస పక్షులు వస్తుంటాయి. పక్షి ప్రేమికులు వెళ్లేందుకు ఇది సరైన సమయం.
- సిటీకి 210 కి.మీ దూరంలో వరంగల్ జిల్లాలో ఉందీ లక్నవరం చెరువు. వరంగల్ సిటీకి 70 కి.మీ దూరంలో గోవిందరావ్‌పేట్ మండలం ములుగుకు సమీపంలో ఉండే ఈ  ప్రాంతానికి వెళ్లాలంటే 7 కి.మీ దట్టమైన బుస్సపూర్ అడవిలో ప్రయాణం చేయాలి.  

 

మరిన్ని వార్తలు