కొత్త కోర్సులతో మెరుగైన ఉపాధి అవకాశాలు

8 Jun, 2014 03:19 IST|Sakshi
  • ప్రైవేట్ సంస్థల సహకారంతో సరికొత్తగా..
  •  జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ పద్మావతి
  •  యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ ఫెయిర్ ప్రారంభం
  • మెహిదీపట్నం, న్యూస్‌లైన్: మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న కోర్సులను అభ్యసిస్తే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పేర్వారం పద్మావతి అన్నారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం ఫైన్‌ఆర్ట్స్ కళాశాలలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు.

    ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యానిమేషన్, ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, టెలివిజన్, ప్రింట్ మీడియా, అడ్వర్టైజ్‌మెంట్స్ వంటి కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఫిలిం మేకింగ్ కోర్సు కూడా ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆధునిక హంగులతో పలు కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. తమతోపాటు కొన్ని ప్రైవేటు ఇన్‌స్టిట్యూషన్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకొని సరికొత్త కోర్సులను అందిస్తున్నాయన్నారు.

    కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్‌లు మరిన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.కవితాదరియానిరావు, ప్రొఫెసర్ ఎస్.ప్రదీప్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్.కుమార్, ప్రొఫెసర్ ఎస్‌ఎన్ వికాస్ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు