పిల్లల విషయంలో జర జాగ్రత్త

19 Nov, 2019 12:20 IST|Sakshi

చిన్నతనంలోనే ప్యాకెట్‌ మనీ, స్మార్ట్‌ ఫోన్లు 

తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్‌ మీడియా 

స్కూళ్లు, కాలేజీలకు సమీపంలోనే మద్యం, గంజాయి విక్రయాలు  

కట్టడి చేస్తే దొంగతనాలు, కిడ్నాప్, హత్యలకు పాల్పడుతున్న వైనం 

తల్లిదండ్రులూ పారాహుషార్‌! 

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల విషయంలో తల్లిదండ్రులు చిన్నతనం నుంచే అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే పెరిగి పెద్దయ్యాక వారు క్రిమినల్స్‌గా, వ్యసనపరులుగా, మానసిక రోగులుగా మారే ప్రమాదం పొంచి ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నగరవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు.

తాజాగా నగరంలోని మీర్‌పేట పోలీస్‌స్టేసన్‌ పరిధిలోని ఓ టెన్త్‌క్లాస్‌ విద్యార్థి అదే కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుమారుడిని కిడ్నాప్‌ చేయడం, వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌ చేయడాన్ని పరిశీలిస్తే..పిల్లల్లో నేరప్రవృత్తి ఏ స్థాయిలో పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లల్లో ఈ నేర ప్రవృత్తి పెరగడానికి ఆన్‌లైన్‌ గేమ్స్, సినిమాలు, హర్రర్‌ సీరియల్స్, పోర్న్‌ చిత్రాలతో పాటు తల్లిదండ్రుల వైఖరి కూడా ఓ కారణమని మానసిక నిపుణులు విశ్లేస్తున్నారు. సంపాదనే లక్ష్యంగా తల్లిదండ్రులు, ర్యాంకులే లక్ష్యంగా విద్యాలయాలు పని చేస్తుండటమే ఇందుకు మరో కారణమని అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు కనీస సమయం కేటాయించక పోవడం, అవసరం లేకపోయినా సంపద ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం, చేతికి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు అందివ్వడం వల్ల పిల్లలు విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.  

పాఠశాలల్లో కౌన్సెలింగ్‌ కేంద్రాలుండాలి 
విద్యాలయాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకుండా చూడాలి. సిగరెట్, పాన్‌ మసాలల విక్రయాలు నిషేధించాలి. చిన్నతనం నుంచే పిల్లలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు స్కూలు స్థాయిలోనే కౌన్సిలర్‌ను నియమించాలి. పిల్లలకు సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వకూడదు. అనివార్యమైతే ఇంటర్‌నెట్‌ లేని కేవలం ఇన్‌కమింగ్‌ అవుట్‌ గోయింగ్‌ సదుపాయం ఉన్న ఫోన్లను మాత్రమే చేతికి ఇవ్వాలి. రోజువారి ఖర్చులకు ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. సంపద ఉంది కదా అని ఖర్చుల కోసం ఇష్టం వచ్చినట్లు వారి చేతికి నగదు, కెడ్రిట్, డెబిట్‌ కార్డులు ఇవ్వకూడదు. తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. క్రైం రిలేటేడ్‌ సినిమాలకు బదులు సందేశాత్మక సినిమాలు చూపించాలి. సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బదులు ఔట్‌డోర్‌ గేమ్స్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. టెన్నిస్, క్రికెట్, కరాటే, యోగా వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించడం వల్ల పిల్లలు శారీరకంగా ధృడంగా తయారవడమే కాకుండా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు.
–డాక్టర్‌ రాధిక, మానసిక వ్యక్తిత్వ నిపుణురాలు   

మెదడుపై ‘మత్తు’ ప్రభావం 
స్కూళ్లు, కాలేజీలకు సమీపంలోనే మద్యం, పాన్‌మసాలా దుకాణాలు ఉన్నాయి. సిగరెట్, ఆల్కహాల్‌ను సొసైటీలో హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. మత్తులో జీవితం గమ్మత్తుగా కన్పిస్తుండటంతో చిన్న వయసులోనే చాలా మంది వీటికి అలవాటు పడుతున్నారు. సిగరెట్, ఆల్కహాల్‌తో మొదలైన ఈ అలవాటు చివరకు గంజాయి, కొకైన్‌ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్‌ వరకు వెళ్తుంది. చిన్న వయసులోనే మత్తుపదార్థాలకు అలవాటు పడటం వల్ల పిల్లలు మొరటుగా, మెండిగా తయారవుతుంటారు. విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తికి అలవాటు పడుతుంటారు. మెదడులో హార్మోన్స్‌ ఇంబ్యాలెన్స్‌ వల్ల నెగటివ్‌ పర్సనాలిటీ డవలప్‌ అవుతుంది. చేతిలో డబ్బు లేకుంటే దొంగతనం, బ్లాక్‌మెయిల్‌కు దిగడం, చివరకు కిడ్నాప్‌లు, హత్యలకు కూడా వెనుకాడబోరు. ఒక్కసారి వీటికి అలవాటు పడితే బయట పడటం చాలా కష్టం. ఎదిగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారి ప్రవర్త నపై దృష్టిసారించాలి. ఏది మంచో..ఏది చెడో చిన్నతనం నుంచే వివరించాలి.  
 – డాక్టర్‌ జయరామ్‌రెడ్డి,వైజేఆర్‌ డీ అడిక్షన్‌ సెంటర్‌

అంతరం పెరుగుతోంది... 
ప్రస్తుతం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య చాలా అంతరం పెరుగుతోంది. మంచి ర్యాంకులు సాధించాలనే ఆశతో చదువు పేరుతో తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. చదువు, ర్యాంకుల పేరుతో ఉదయం నిద్ర లేచింది మొదలు..రాత్రి పడుకునే వరకు వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. అంతేకాదు ఎదిగే పిల్లలకు ఏది మంచో..ఏదీ చెడో చెప్పాల్సిన తల్లిదండ్రులు కూడా వారికి దూరంగా గడుపుతున్నారు. పిల్లల ఆలోచనలు, అభీష్టాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయ ఆటలకు బదులు ఆన్‌లైన్‌ గేమ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్లు చేతిలో ఉండటం వల్ల పిల్లలు సోషల్‌ మీడియాకు ఈజీగా కనెక్ట్‌ అవుతున్నా రు. సినిమాలు, సీరియల్స్‌లో హీరోయిజం కంటే విలనిజానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో పిల్లలు తమను తాము ఓ హీరోలా భావించుకుంటున్నారు. చిన్నతనంలోనే గంజాయి, ఆల్కాహాల్‌ వంటికి అవవాటు పడుతున్నారు.
 – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం  

>
మరిన్ని వార్తలు