‘గాంధీ’ రోగులకు మెరుగైన వైద్యసేవలు

19 Feb, 2019 02:03 IST|Sakshi
గాంధీ ఈఎన్‌టీ వార్డు వద్ద సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న గవర్నర్‌ నరసింహన్‌

మరిన్ని వసతుల కల్పనకు కృషి చేస్తానన్న గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, నిరుపేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న ఆయనకు సోమవారం గాంధీఆస్పత్రికి వచ్చారు. ఈఎన్టీ విభాగంలో ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆస్పత్రిలోని పారిశుధ్య నిర్వహణ గురించి గవర్నర్‌ అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గవర్నర్‌కు తెలపగా నూతన నియామకాలు కోసం తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఇక్కడ 1,012 పడకలుండగా, సుమారు 2 వేల మందికిపైగా ఇన్‌పేషెంట్లకు నిత్యం వైద్యసేవలు అందిస్తున్నామని, పడకల సంఖ్యను అధికారికంగా 2 వేలకు పెంచితే అందుకు అనుగుణంగా బడ్జెట్‌తోపాటు వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టవచ్చని చెప్పగా, ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని గవర్నర్‌ హామీనిచ్చారు. మరోమారు వచ్చి రోగుల సమస్యలను తెలుసుకుంటానని గవర్నర్‌ తెలిపారు.  

సాధారణ రోగిలా గవర్నర్‌ 
గవర్నర్‌ నరసింహన్‌ గాంధీ ఆస్పత్రికి సాధారణ రోగిలా వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అంతకుముందు వినికిడి సమస్య ఉందని చెప్పడంతో ఈఎన్టీ వైద్యుల బృందాన్ని రాజ్‌భవన్‌కు పంపిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెప్పారు. విధుల్లో ఉన్న వైద్యులు తన వద్దకు వస్తే నిరుపేద రోగులు అసౌకర్యానికి గురవుతారని భావించిన గవర్నర్‌ ఓపీ సమయం పూర్తి అయిన తర్వాత తానే వస్తానని చెప్పారు. సోమవారం ఉదయం 12.10 గంటలకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన గవర్నర్‌కు ఆస్పత్రి పాలనాయంత్రాంగం స్వాగతం పలికింది. గవర్నర్‌ను నేరుగా ఓపీ విభాగంలోని ఈఎన్టీ వార్డుకు తీసుకువెళ్లారు. హెచ్‌ఓడీ శోభన్‌బాబు నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు 15 నిమిషాలపాటు వివిధ రకాల వైద్యపరీక్షలు నిర్వహించింది. చెవుల్లో జమ అవుతున్న గుబిలి(డస్ట్‌)వల్లే వినికిడి సమస్య ఉత్పన్నం అవుతున్నట్లు గుర్తించి రెండు చెవులను శుభ్రపరిచారు. ఈఎన్‌టీ వైద్యులు అందించిన సేవలపై గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్, డిప్యూటీ నర్సింహరావునేత, జనరల్‌ మెడిసిన్, ఈఎన్‌టీ హెచ్‌ఓడీలు రాజారావు, శోభన్‌బాబు, ఆర్‌ఎంఓలు జయకృష్ణ, శేషాద్రి, సాల్మన్, ప్రభుకిరణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు