మెరుగైన సేవలందిస్తా

1 Aug, 2014 03:05 IST|Sakshi

మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా ప్రజలకు 24గంటలు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తానని జిల్లా నూతన కలెక్టర్ జీడి ప్రియదర్శిని వెల్లడించారు. గురువారం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లాడారు. ముందుగా పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు కలెక్టర్‌గా రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
 
 ఇక జిల్లా ప్రజలు ఏవిధమైన పాలనను కోరుకొంటున్నారో అలా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇంతవరకు కలెక్టర్‌గా పనిచేసిన గిరిజాశంకర్ తన బ్యాచ్‌మెటని, ఆయన జిల్లాకు అందించిన సేవలను ఆదర్శంగా తీసుకొని రాణిస్తానని చెప్పారు. వారం రోజుల్లో జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని మెరుగైన పాలనను అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది అందరి సహకారాన్ని తీసుకొంటానని చెప్పారు.
 
 బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ప్రియదర్శిని
 జిల్లా కలెక్టర్‌గా జీడీ ప్రియదర్శిని గురువారం ఉదయం 11.43గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ నుంచి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ గిరిజాశంకర్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం జిల్లాస్థాయి అధికారులను ప్రియదర్శినికి పరిచయం చేసి వెళ్లిపోయారు. కొత్త కలెక్టర్ ప్రియదర్శిని రాకకుముందు బదిలీ అయిన కలెక్టర్ గిరిజాశంకర్ తన చాంబర్‌లో అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జేసీ, అడిషనల్ జేసీ, డీఆర్‌ఓలకు విజ్ఞప్తి చేశారు. మనం ఎన్నాళ్లు ఉన్నామన్నది కాకుండా ఉన్నన్నాళ్లు ఏం చేశామన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ఈ లోపు కొత్త కలెక్టర్ ప్రియదర్శిని రావడంతో ఆమెకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం వేరే వాహనంలో బంగ్లాకు వెళ్లారు.
 
 కలెక్టర్ ప్రొఫైల్:
 2002 బ్యాచ్‌కు చెందిన జీడీ ప్రియదర్శిని ముందుగా విపత్తుల శాఖ సహాయ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం హౌసింగ్ శాఖ కార్యదర్శిగా, సీసీఎల్‌ఏ కమిషనర్‌గా పనిచేస్తోన్న సమయంలో 2008లో ఐఏఎస్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ తరువాత వెంటనే నల్లగొండ జిల్లాకు జేసీగా వెళ్లిన యేడాదికే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు నార్త్‌జోన్ సహాయ కమిషనర్‌గా మూడున్నర ఏళ్లు పనిచేశారు. అక్కడి నుంచి గతేడాది అక్టోబర్ 30న అపార్డ్‌కు డెరైక్టర్‌గా వెళ్లారు. 8నెలల ఆతరువాత మహబూబ్‌నగర్ జిల్లాకు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు.
 
 శుభాకాంక్షల వెల్లువ..
 నూతన కలెక్టర్‌గా బాధ్యత్యలు చేపట్టిన  ప్రియదర్శినికి జిల్లా అధికారులతోపాటు, సిబ్బంది నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముందుగా జేసీ ఎల్.శర్మన్ పూలబోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలుపగా, ఆ తరువాత ఏజేసీ, డీఆర్వో, జెడ్పీ సీఈఓ, డీఆర్‌డీఏ పీడీలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నేతలంతా కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలుపగా, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది బారులు దేరడంతో అంతా సందడివాతావరణం నెలకొంది.
 

మరిన్ని వార్తలు