ఎన్ని'కల' పందెం కాస్కో..!

9 Dec, 2018 11:17 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ 

11న రిజల్ట్‌పై రూ.లక్షల్లో బెట్టింగ్‌  

 చాపకింద నీరులా విస్తరిస్తున్న పందేలు 

 పట్టణాల నుంచి పల్లెలకు పాకిన జాఢ్యం

సాక్షి, కొత్తకోట: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈనెల 11న వెలువడే ఫలితాలపై రూ.లక్షల బెట్టింగ్‌ నడుస్తోంది. జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌పోల్‌ సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండగా, ఒక్క లగడపాటి ఎగ్జిట్‌పోల్‌ సర్వే మాత్రం మహాకూటమికి సానుకూలంగా ఉందని చెప్పడం అందరిలోనూ ఉత్కంఠ రేపింది.

గతంలో జరిపిన లగడపాటి సర్వేలు చాలా మేరకు విజయవంతమవడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొంత అలజడి నెలకొంది. దీంతో నేషనల్‌ ఎగ్జిట్‌పోల్స్‌పై నమ్మకం ఉంచుతూ కొందరు బెట్టింగులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలో బెట్టింగు రాయుళ్లు సైతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

రాజకీయ విశ్లేషకులకు మించిన స్థాయిలో ఓటింగ్‌ జరిగిన తీరునూ అంచనా వేస్తూ పందేలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొత్తకోట పట్టణంతో పాటు దేవరకద్ర, భూత్పూర్, అడ్డాకుల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతో పాటు మదనాపురం, మూసాపేట వంటి మారుమూల ప్రాంతాలకు ఈ జాఢ్యం అంటుకుంది. ఈ క్రమంలో కొందరు లాభపడటం.. మరికొందరు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 
ఫలితాలపై బెట్టింగ్‌ల తీరు  
ఎన్నికలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి. ఆయా రాజకీయ పార్టీలు రూ.కోట్లు ఖర్చుచేశాయి. డబ్బు, మద్యం ఏరులై పారింది. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ప్రచారం మొదలుకుని పోలింగ్‌ వరకు పందెం కాస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందా.. మహాకూటమి వస్తుందా.. లేక హంగ్‌ ఏర్పడనుందా.. అంటూ పందెం కాస్తున్నారు.

అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుస్తాడా.. లేక మహాకూటమి అభ్యర్థి గెలుస్తాడా.. బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయనే కోణంలో బెట్టింగులు కాస్తున్నారు. ఇవీ కాకుండా బెట్టింగ్‌ రాయళ్లు ఇంకొంచెం ముందుకెళ్లి ఆయా పట్టణాల్లో తమ నాయకుడికే అత్యధిక ఓట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఏ మండలం ఎవరికి ఎంత లీడ్‌ ఇస్తుందో చెబుతున్నారు.  


పల్లెల్లో బెట్టింగ్‌ భూతం 
ఎన్నికలకు ముందు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా కొత్తకోట, దేవరకద్ర మండలాల్లో బెట్టింగ్‌  కాసినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు, లగడపాటి సర్వేలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఉండటంతో బెట్టింగ్‌ల స్థాయి పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. దీంతో ఆయా మండలాల్లో కీలక నేతలు ఉండే గ్రామాల్లో కార్యకర్తల బెట్టింగ్‌ల జోరు ఊపందుకుంది. బెటింగ్‌ రాయుళ్ల ఆశలు నెరవేరాలంటే ఈనెల 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.   


స్వేహపూర్వకంగా గెలుపోటములు   
ఏ పోటీలోనైనా గెలుపోటములు స్వేహపూర్వకంగా ఉండాలి. అంతేగాని కొట్లాటలు, పోట్లాట వరకు వెళ్లకూడదు. ఫలితాలపై ఉత్కంఠ ఉండటం సహజమే. కానీ ఈ నెపంతో పందెం కాసి డబ్బు పోగొట్టుకోవడం మంచిది కాదు. ఆయా పార్టీల వారిలో ఎవరి ధీమా వారికే ఉంటుంది. ప్రస్తుతం ఓటర్లు పూర్తి అవగాహనతో ఓటు వేస్తున్నారు. వారి నాడి ఎవరికి అంతుచిక్కడం లేదు.                – రవికాంత్‌రావు, ఎస్‌ఐ, కొత్తకోట   

మరిన్ని వార్తలు