కాయ్‌ రాజా.. కాయ్‌..!

13 Apr, 2019 06:13 IST|Sakshi

అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు

బూతుల వారీగా ఓట్లు లెక్కించుకుంటున్న అభ్యర్థులు

ఆందోళనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు

దిల్‌సుఖ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మిగిలింది ఎన్నికల ఫలితాలే.. ఫలితాలకు ఇంకా 42 రోజుల గడువు ఉండటంతో అప్పటి వరకు ఆగలేని నాయకులు తమ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. దీంతో రంగంలోని దిగిన బెట్టింగ్‌ రాయుళ్లు  రెచ్చిపోతున్నారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల సమరంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, ఇష్టం ఉన్నా లేకున్న ముఖంపై రంగు పులుముకొని అందరినీ పేరుపేరునా పిలుస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటు ప్రచారం నిర్వహించారు. మరికొందరు లేని చుట్టరికాన్ని కలుపుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తు చేసిన ప్రచారం పోలింగ్‌తో ముగిసింది. ఇక తేలాల్సింది అభ్యర్థుల భవితవ్యమే.

బూతుల వారీగా లెక్కింపులు..
ఆయా లోక్‌సభ సెగ్మెంట్లలో  శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ భవితవ్యంపై తమ అనుచరగణంతో బూతుల వారీగా లెక్కలు తెప్పించుకుని సరి చూసుకుంటున్నారు.  మరికొంతమంది చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్‌  అభ్యర్థులు తమ ఓటమిని ముందుగానే నిర్ణయించుకుని ఎంచక్కా వేసవి విడిదికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు.

బెట్టింగుల జోరు..
కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన తమకు విజయం వరిస్తుందని గంపెడాశతో అభ్యర్థులు ఉన్నారు. అయితే ఆయా నియోజక వర్గాల్లోని నాయకులు, చోటామోటా నేతలు తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకుపాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్‌లు కార్యకర్తలమధ్య అయితే వేలల్లోనూ మోస్తరి నాయకులమధ్య అయితే లక్షల్లోనూ సాగుతున్నట్లు వినికిడి.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
ఎన్నో నెలలుగా ఎంతో కష్టపడి తమ నాయకుని పక్షాన ప్రచారం చేశామని, ఇప్పుడు తమ నాయకుడు ఓడిపోతాడని అవతలి పక్షం వారు లెక్కలు కట్టి తేల్చి చెబుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ విధంగా బెట్టింగ్‌లు కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

చేవెళ్ల  పరిధిలో జోరుగా..
చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఎక్కువగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో తమ అభ్యర్థలు గెలిస్తే తమకు పూర్తి సంతోషంతో పాటు డబుల్‌ దమాకాగా బెట్టింగ్‌ కట్టిన డబ్బులకు రెండింతలు వస్తాయని లేకపోతే అభ్యర్థి ఓటమితోపాటు తమ డబ్బులు కూడా పోతాయని వాపోతున్నారు. ఈ బెట్టింగ్‌ల విషయం తెలియని అభ్యర్థులు మాత్రం తమ భవితపై ఎన్నో ఆశలతో ఉన్నారు. మరో నలభై రెండు రోజులపాటు ఈ టెన్షన్‌ అనుభవించక తప్పదు మరి.

మరిన్ని వార్తలు