సాగుతూ...నే

17 Nov, 2014 01:46 IST|Sakshi

ఏళ్లు గడిచినా పూర్తికాని బేతుపల్లి కాల్వ    
ఏటేటా పెరుగుతున్న వ్యయం


వేంసూరు మండలానికి ఒకప్పుడు పాత ఎన్టీఆర్ కాల్వ నుంచి నీరు అందేది. ఇప్పుడు అది కాస్త సింగరేణి ఓపెన్‌కాస్టు విస్తరణలో పోతోంది. కాబట్టి బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ ద్వారా ఆ మండలానికి నీరందించాలని నిర్ణయించారు. 49 చెరువులకు రోజుకు 150 క్యూసెక్కుల వరదనీటిని 18 రోజులపాటు రెండు విడుతలుగా విడుదల చేయాలని భావించారు. 2,700 క్యూసెక్కుల నీటితో చెరువులను నింపేందుకు 2007లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుమతితో కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. తరచూ డిజైన్ మార్పులతో అంచనా వ్యయం రూ.33 కోట్ల నుంచి రూ.145.52 కోట్లకు చేరింది. పనులు ఇప్పటికీ సాగుతూ...నే ఉన్నాయి.

సత్తుపల్లి : బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2007లో రూ.33 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు 2009 నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ నేటికీ పూర్తి కాలేదు. పలుమార్లు డిజైన్ మార్పులతో ఓవైపు నిర్మాణ వ్యయం పెరుగుతుండగా మరోవైపు పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. ఇందిరాసాగర్ ప్రాజెక్టు(రుద్రంకోట) పరిధిలోని ఈ కాల్వ డిజైన్‌ను మార్చి కొత్త ప్రతిపాదనలు తయారు చేశారు.

2008-09లో ప్రభుత్వానికి పంపించారు. 2011లో రూ.89 కోట్లతో కాల్వ నిర్మాణ పనులకు అనుమతి లభించింది. 2010-11లో స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం డిజైన్ మంజూరు అయింది. అంచనా విలువ అమాంతం రూ.123.69 కోట్లకు చేరింది. ఇప్పటికే రూ.69 కోట్ల నిధులు ఖర్చు చేశారు. కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం మళ్లీ 2013-14లో రూ.145.52 కోట్లు అవుతున్నట్లు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదన ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

మొదటి డిజైన్
సత్తుపల్లి మండలం వేశ్యకాంతల చెరువు, జీలుగులు చెరువు, రేజర్ల చెరువు, వేంసూరు మండలంలోని 45 చెరువులకు సాగునీరు అందించేందుకు 13.8 కిలోమీటర్లు బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ నిర్మాణం చేపట్టారు. బేతుపల్లి చెరువు నుంచి వేశ్యకాంతల చెరువు వరకు 3.5 కి.మీ బండ్(మట్టితో కట్ట) కాల్వ చేపట్టాల్సి ఉంది. బండ్ కాల్వకు ఇరువైపులా 50 మీటర్ల వెడల్పు, 6 అడుగుల ఎత్తులో కాల్వకు 12 మీటర్ల వెడల్పుతో రాయితో రివిట్‌మెంట్ చేయాల్సి ఉంది. 5.4 మీ. వెడల్పు, మూడుమీటర్ల పొడవుతో తొట్టి ఆకారంలో సీసీ నిర్మాణ కాల్వ , 9 మీటర్లకు ఒక ఫిల్లర్‌తో 1.9 కి.మీ, 11.9 కి.మీ కాల్వ నిర్మాణం 12 మీటర్ల వెడల్పు, 3 మీటర్లలోతు, 84 యూటీలు, చిన్నచిన్న బ్రిడ్జిలు, ఎస్కెప్ రెగ్యులేటర్‌ను డిజైన్ చేశారు. 27 కి.మీ పొడవున్న ఉన్న పాత కాల్వకు 13.8 కి.మీ వద్ద కొత్తకాల్వ కలుస్తుంది.

మారిన డిజైన్
ఈ కాల్వ ఇందిరాసాగర్ ప్రాజెక్టు పరిధిలోకి రావటంతో 2008-09లో డిజైన్ మార్చారు. 3.5 కి.మీ బండ్ కాల్వ 10 మీటర్ల ఎత్తు ఉండేలా మూడుమీటర్లున్న సీసీ నిర్మాణం తొట్టి ఎత్తును 6 మీటర్లు, 9 మీటర్లకొక పిల్లర్ స్థానంలో 4.5 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటు చేసి, వెయ్యి క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లేలా రూపొందించారు. ఈ సీసీ (తొట్టి) నిర్మాణ పనులు 85శాతం పూర్తికావచ్చాయి. స్టేట్ హైవేపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏడు అడుగుల ఎత్తు వర కు బండ్ కాల్వ నిర్మాణం, రివిట్‌మెంట్ పనులు చేస్తున్నారు.

అధికారుల సమన్వయలోపం
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయ లోపం భూ సేకరణకు సమస్యగా మారింది. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వటంలో రెవెన్యూ యంత్రాంగం తన వైఖరి స్పష్టం చేయలేదు. దీనివల్ల కాల్వ నిర్మాణ పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. ఇటీవలే అధికారులు అసైన్డ్ భూములకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు దీనిపై రైతులతో ఎటువంటి చర్చలు జరపకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి మండలం రేజర్ల, వేంసూరు మండలం లింగపాలెం గ్రామాలలో సుమారు 13 ఎకరాల అసైన్డ్ భూములకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది.

గతంలో 103 ఎకరాల పట్టా భూమికి రూ.6 కోట్ల పరిహారం ఇచ్చారు. గతేడాది పట్టా భూముల్లో అంచనాకు మించి సేకరించిన అదనపు భూములకు ఎకరాకు రూ.6 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించారు. అసైన్డ్ భూములకు నష్ట పరిహారం తేల్చమని రైతులు గ్రామసభలో జిల్లా అధికారులను కోరారు. ప్రభుత్వ నిర్ణయానికి పంపిన నేపథ్యంలో అసైన్డ్ భూముల నష్ట పరిహారంలో స్పష్టత కొరవడింది.

ఆగిన సింగరేణి విస్తరణ
బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ పనుల్లో జాప్యం సింగరేణి ఓపెన్‌కాస్టు విస్తరణ పనులకూ ఆటంకంగా మారాయి. సింగరేణి అధికారులు  రెండేళ్ల నుంచి పాత ఎన్టీఆర్ కాల్వను అప్పగించమని రెవెన్యూ యంత్రాంగాన్ని పలుమార్లు కోరినట్లు సమాచారం. బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ పనులు పూర్తికాకుండా పాత ఎన్టీఆర్ కాల్వను సింగరేణి స్వాధీనం చేసుకోవటం వల్ల వేంసూరు మండలానికి సాగునీటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సింగరేణి మొదటి విడత రూ.33 కోట్లు, రెండో విడత రూ.22 కోట్లు రీయింబర్స్‌మెంట్ కింద ఇచ్చింది. సింగరేణి ఇచ్చిన నిధులను ప్రభుత్వం తిరిగి ఆ సంస్థకే చెల్లించినట్లు తెలిసింది.

నీటికోసం ఎదురుచూపు
వేంసూరు మండల రైతాంగం బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ పనులు పూర్తికాక పోవటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పాత ఎన్టీఆర్‌కాల్వలో వరదనీరు పారటం చాలా కష్టంగా మారింది. ప్రతి ఏడాది బేతుపల్లి చెరువునీరు విడుదల చేయటమే కానీ.. వేంసూరు మండలంలో కనీసం ఒక్క చెరువుకూ నీరు అందించే పరిస్థితి లేదు. ఐదేళ్ల క్రితమే పూర్తి కావాల్సిన బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతాంగం ఇబ్బంది పడుతోంది.

మరిన్ని వార్తలు