భద్రాచలం ముమ్మాటికీ మనదే..

8 Apr, 2019 16:34 IST|Sakshi

భద్రాచలంటౌన్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం తెలంగాణలోనిదేనని 1969 తెలంగాణ ఉద్యమకారుడు తిప్పన సిద్ధులు అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్రా సీఎం చంద్రబాబు ఎన్నికల ఉపన్యాసంలో భద్రాచలం ఆంధ్రా ప్రాంతానికి సంబంధించిందే అంటూ ప్రసంగిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే అతనిపై ఉన్న కక్షతో, ప్రజలపై నిప్పుల వంటి మాటలను విసురుతున్నారని వాపోయారు. ఇప్పటికైన భద్రాచలం చరిత్రను తెలుసుకొని మాట్లాడటం మంచిదన్నారు.

పాల్వంచ డివిజన్‌లో ఉండే భద్రాచలం 1959లో వరంగల్‌ జిల్లాలో ఖమ్మం ప్రాంతం పరిపాలన సౌలభ్యం కోసం కలసిపోవడం వలన భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మొదలగు ప్రాంతాలు పరిపాలన కోసం కాకినాడలో కలపడం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లా ఏర్పడిన తరువాత ఈ ప్రాంతాలను తిరిగి ఖమ్మం జిల్లాలో కలపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వలన బ్యాక్‌ వాటర్‌ కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని 7 మండలాలను ఆంధ్రాలో కలపడం జరిగిందన్నారు.

పార్లమెంట్‌లో ఎంపీ జైరామ్‌ రమేష్‌ తయారు చేసిన బిల్లును ఎటువంటి సర్వే చేయకుండా ఆమోదించడం వలన భద్రాచలం పక్కన ఉన్న గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచకలపాడు మొదలగు గ్రామ పంచాయతీలను కూడా కలుపుకోవడం జరిగింది.  ఆనాడు హిట్లర్‌ తన ప్రేయసి కోసం ప్రపంచాన్ని గెలిచి ఇస్తానని, రెండో ప్రపంచ యుద్ధంలో మరణించడం జరిగింది. 

నీరో చక్రవర్తి రోమ్‌ తగలబడి పోతుంటే ఫిడేల్‌పై సంగీతాన్ని వాయించిన విధంగా చంద్రబాబు తెలంగాణ ప్రజలపై మాటల తూటాలను వదులుతున్నాడన్నారు. ఇది చంద్రబాబుకు తగదని, ఇకనైన చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని 1969 తెలంగాణ ఉద్యమకారుడు తిప్పన సిద్ధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు తాళ్ల రవి, నలజాల శ్రీనువాసరావు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు