శాస్త్రోక్తంగా రామయ్య కల్యాణం

3 Apr, 2020 03:18 IST|Sakshi
శ్రీరామనవమిని పురస్కరించుకొని గురువారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మిథిలా స్టేడియానికి బదులు బేడా మండపంలో కార్యక్రమం 

లాక్‌డౌన్‌తో భక్తులు లేకుండానే కల్యాణం  

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, అజయ్‌కుమార్‌

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా భక్తులు లేకుండానే పరిమిత సంఖ్యలో వేదపండితులు, అర్చకులు, ఇద్దరు మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కొద్దిమంది అధికారులు మాత్రమే కల్యాణ వేడుకలో పాల్గొన్నారు. ప్రతీ సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రికి భక్తులు భారీ గా తరలివచ్చేవారు. కానీ కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో భక్తులను కల్యాణ వేడుకలకు అనుమతించకపోవడంతో ఆలయం బోసిపోయింది. అయితే కోట్లాది మంది భక్తులు టీవీల ద్వారా ఈ కమనీయ ఘట్టాన్ని వీక్షించి తరించారు. భద్రాచలంలో భక్తరామదాసు కాలం నుంచి ఏటా శ్రీరామ నవమి వేడుకలను మిథిలా స్టేడియం లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించే బేడా మండ పంలోనే కల్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు లేకుండా రామయ్య కల్యాణం నిర్వ హించడం ఇదే తొలిసారని అర్చకులు తెలిపారు.
 
తెల్లవారుజాము నుంచే  ప్రత్యేక పూజలు.. 
శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణ క్రతువు గురువారం తెల్లవారుజామున రెండు గంటలకే ప్రారంభమైంది. మొదట స్వామివారికి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, ధ్రువమూర్తులకు అభిషేకం నిర్వహించారు. తరువాత అంతరాలయంలోని మూలమూర్తులకు కల్యాణం జరిపించారు. అనంతరం మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్చరణలతో సీతారాముల ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. రజత సింహాసనంపై ఆశీనులను చేశారు. పవిత్ర జలాలతో పుణ్యాహవచనం చేశారు. భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను అలంకరించారు. వేదికపై ఆసీనులైన శ్రీసీతారాములకు అర్చకులు ముందుగా తిరువారాధన, విష్వక్సే న పూజ నిర్వహించి మంటప శుద్ధి చేశారు.

ఆ తర్వాత మోక్షబంధన, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణ గావించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేసి, సంకల్పం చెప్పారు. అనంతరం కన్యాదానం, గోదానం, భూదానం నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నం లో స్వామి, అమ్మవార్ల ఉత్స వ విగ్రహాలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. భక్త రామదాసు చేయించి న మంగళసూత్రాల తో మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంత రం తలంబ్రాల వేడుకను జరిపించారు. ఈ కార్యక్రమంలో ప్ర భుత్వ సలహాదారు రమ ణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.  

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు.. 
శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ర వాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్‌ లగ్న సుముహూర్తాన సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు స్వా మి, అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టారు. భద్రాద్రిలో సీతమ్మవారికి మూడు మంగళసూత్రాలు ఉండటం విశేషం. ఇందులో ఒకటి పుట్టింటిది, రెండోది మెట్టినింటిది కాగా, మూ డోది భక్త రామదాసు (కంచర్ల గోపన్న) చేయించినది. భక్త రామదాసు చేయించిన ఆభరణాలు కల్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాముడికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకు పతకం, లక్ష్మణుడికి రామ మాడ అలంకరించారు. ఏపీలోని తూర్పుగోదావరి నుంచి భక్తులు ఈసారీ గోటి (కోటి) తలంబ్రాలు పంపించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా