రాబడి తగ్గింది..!

11 Sep, 2018 07:24 IST|Sakshi
హుండీ డబ్బు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆదాయం గతంతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గింది. ఆలయానికి రెగ్యులర్‌ ఈఓ ఉన్నప్పుడు.. ప్రముఖ భక్తులు ఎవరైనా వస్తే.. వారితో మాట్లాడడం, సరైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక పూజలు చేయించేవారు. అప్పుడు వారు హుండీలో వేసే కానుకలు కూడా భారీగానే ఉండేవి. ఇప్పుడు రెగ్యులర్‌ ఈఓ లేకపోవడమే ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో నెల రోజులకు ఒకసారి హుండీ లెక్కించేవారు.  సుమారు రూ.75 లక్షల మేర ఆదాయం లభించేంది. రోజువారీగా స్వామివారికి అన్ని కార్యక్రమాలకు సంబంధించి రోజుకు సుమారు రూ.2 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీనికి కారణం అధికారుల అలసత్వం, సరైన పర్యవేక్షణ లోపం, స్వామివారి కార్యక్రమాలపై సరైన ప్రచారం లేకపోవడం కారణమని భక్తులు అంటున్నారు.

102 రోజులకు రూ. 1.28 కోట్లు..
స్వామివారి హుండీలను సోమవారం ఆలయంలోని చిత్రకూట మండపంలో లెక్కించగా.. 102 రోజులకు గానూ రూ.1.28,45,721 లభించినట్లు ఆలయ ఈఓ పమెల సత్పథి తెలిపారు. ఈ ఆదాయంతో పాటు 513 యూఎస్‌ డాలర్లు, 50 యూఏఈ దినార్లు, 6 కువైట్‌ దినార్లు, 4సౌదీ రియాల్స్, 60 ఆస్ట్రేలియా డాలర్లు, 2 ఖతార్‌ రియాల్స్, 2 చైనా యాన్స్‌ లభించినట్లు తెలిపారు.
 
స్వీపర్‌ చేతివాటం.. చర్యలకు రంగం సిద్ధం..
స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో స్వీపర్‌ వెంకన్న చేతివాటం ప్రదర్శించి, రూ.3 వేలు తస్కరించాడు. మధ్యలో బయటకు వెళుతుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సోదా చేయగా అతని వద్ద రూ.3 వేలు దొరికాయి. వెంటనే ఈ విషయాన్ని ïఆలయ ఈఓ పమెల సత్పథికి, ఆలయ అధికారులకు తెలిపారు. గతంలో ఇలాంటి  ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ ఈఓలు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు దగ్గర ఉండి హుండీల లెక్కింపు కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఇటీవల కాలంలో అధికారులు, సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి హుండీ లెక్కింపు కార్యక్రమం, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు