హెల్మెట్‌ లేకుంటే బైక్‌ నడవదు !

10 Mar, 2019 09:45 IST|Sakshi
హెల్మెట్‌ లేకుంటే స్టార్ట్‌ కాని బైక్‌ (ఇన్‌సెట్‌) సిస్టంను డెవలప్‌ చేసిన కొట్టె ప్రవీణ్‌

బూర్గంపాడు : హెల్మెట్‌ లేకుంటే బైక్‌ నడవకుండా ఓ వినూత్న ప్రయోగం చేసి సఫలీకృతుడయ్యాడు భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు. హెల్మెట్‌ ఉంటేనే మోటార్‌సైకిల్‌ నడిచేలా ఓ టెక్నిక్‌ కనిపెట్టాడు. గ్రామానికి చెందిన కొట్టె ప్రవీణ్‌ కొత్తగూడెంలోని రుద్రంపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఈఈఈ పూర్తిచేశాడు. ఇటీవల జరుగుతున్న రోడ్డుప్రమాదాల నివారణకు, మోటార్‌సైకిళ్ల చోరీకి అడ్డుకట్ట వేయాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, గతంలో రిమోట్‌ టాయ్స్‌ తయారుచేసిన అనుభవంతో మోటార్‌సైకిల్‌ నడవాలంటే హెల్మెట్‌ ఉండేలా ఓ టెక్నిక్‌ను తయారుచేశాడు. మోటార్‌సైకిల్‌ ఇగ్నిషన్‌ను రిలే సర్క్యూట్‌తో అనుసంధానం చేశాడు. రిలే సరూŠయ్య్‌ట్‌ను ఆన్, అఫ్‌ చేసేందుకు ఓ ట్రాన్స్‌మీటర్‌ను హెల్మెట్‌లో అమర్చాడు. ట్రాన్స్‌మీటర్‌ సిగ్నల్‌ కమ్యూనికేషన్‌ ఉంటేనే మోటార్‌సైకిల్‌ ఇగ్నిషన్‌కు అనుసంధానం చేసిన రిలే సర్క్యూట్‌ పనిచేస్తుంది. హెల్మెట్‌ దగ్గరుంటేనే ట్రాన్స్‌మీటర్‌ నుంచి సిగ్నల్స్‌ అంది.. మోటార్‌సైకిల్‌ స్టార్ట్‌ అవుతుంది. లేకుంటే కాదు. హెల్మెట్‌ మరిచిపోయినా మోటార్‌సైకిల్‌ నడవదు.

హెల్మెట్‌కు అమర్చిన ట్రాన్స్‌మీటర్‌ పనిచేసేందుకు వారానికి ఒకసారి చార్జింగ్‌ పెట్టుకోవాల్సి ఉంటుందని ప్రవీణ్‌ తెలిపాడు. గోవాలో జిందాల్‌ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ ఆధారంగా విద్యుత్‌ మోటార్‌లు ఆన్, ఆఫ్‌ చేసి సక్సెస్‌ అయ్యానని,  ఇళ్లలోని గదులకు రక్షణ కల్పించేందుకు సెక్యూరిటీ సిస్టం డెవలప్‌ చేశానని ప్రవీణ్‌ తెలిపారు. హెల్మెట్‌ పెట్టుకోవాలని ఎంత ప్రచారం చేసినా వాహనదారులు పట్టించుకోవటం లేదని, తాను తయారుచేసిన హెల్మెట్‌ ట్రాన్స్‌మీటర్‌ సిస్టం పూర్తిస్థాయిలో డెవలప్‌ చేస్తే మోటార్‌సైకిల్‌ నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్‌ తప్పనిసరిగా పెట్టుకుంటారని, దీంతో రోడ్డుప్రమాదాలలో మరణాల శాతం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. హెల్మెట్‌ లేకుంటే మోటార్‌సైకిల్‌ స్టార్ట్‌ కానందున బైక్‌ చోరీలు కూడా తగ్గిపోతాయన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేస్తానని ప్రవీణ్‌ ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు