బషీరాబాద్‌కు ‘భగీరథ’

28 Aug, 2018 09:03 IST|Sakshi
గోనూరుదగ్గర ఎయిర్‌ వాల్వ్‌ దగ్గర బయటకు చిమ్ముతున్న కృష్ణా వాటర్‌  

పగిడ్యాల్‌ ఓహెచ్‌బీఆర్‌ నుంచి నవల్గకు చేరిన కృష్ణమ్మ

32 కి.మీ ట్రయల్‌రన్‌ విజయవంతం

గ్రావిటీ మెథడ్‌తో పైపుల ద్వారా కృష్ణమ్మ పరుగులు

సెప్టెంబర్‌ 15 వరకు గ్రామాలకు రక్షిత తాగునీరు

బషీరాబాద్‌(తాండూరు) : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ రానే వచ్చింది. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ అందించనున్న రక్షిత తాగునీరు ఇప్పటికే శ్రీశైలం నుంచి పరిగిలోని జాఫర్‌పల్లి డబ్ల్యూపీటీకి చేరింది. యాలాల మండలం పగిడ్యాల్‌ ఓహెచ్‌బీర్‌ ట్యాంకు నుంచి బషీరాబాద్‌ మండలం నవల్గ సంపు వరకు సుమారు 32 కి.మీ మేర నిర్వహించిన ట్రయల్‌రన్‌ విజయవంతమైంది.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ రక్షితè తాగునీరు కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్‌ మండలానికి చేరుకుంది. ఎక్కడ కూడా మోటార్లు ఉపయోగించకుండా కేవలం గ్రావిటీ మెథడ్‌తోనే (గురుత్వాకర్షణ పద్ధతి) పరిగిలోని జాఫర్‌పల్లి నుంచి బషీరాబాద్‌ మండలం నవల్గకు కృష్ణమ్మ నీరు పైపుల్లో పరుగులు పెట్టింది.

పగిడ్యాల్‌ నుంచి నవల్గ వరకు నిర్వహించిన తొలి ట్రయల్‌రన్‌ విజయవంతమైనట్లు మిషన్‌ భగీరథ సివిల్‌ ఇంజినీరు రాములు ప్రకటించారు. అయితే నీటి ఒత్తిడి కారణంగా యాలాల మండలంలోని హాజీపూర్‌ గేటు వద్ద పైపులైన్‌ జయింట్‌లో స్వల్ప లీకేజీ కావడంతో వరి పొలాల్లోకి నీళ్లు చేరాయి. తాండూరు మండలంలోని గోనూరు గేటు సమీపంలో ఎయిర్‌ వాల్వ్‌ ద్వారా నీళ్లు బయటకు చిమ్మాయి. అటు నుంచి నేరుగా నవల్గ చెరువు కట్ట సమీపానికి నీళ్లు చేరాయి. అయితే పైపులైన్‌లో ఉన్న మట్టితో ఒండ్రు నీళ్లు రావడంతో నవల్గ చెరువు కట్టకింద ఉన్న ఎయిర్‌ షవర్‌ వద్ద ఆ నీటిని వదిలేశారు. నవల్గ సమీపంలోని ప్రధాన సంపునకు కి.మీ దూరంలోకి రాగానే అధికారులు ట్రయల్‌ రన్‌ను నిలిపేశారు.  

తుదిదశకు ట్యాంకుల నిర్మాణం 

బషీరాబాద్‌ మండలంలోని రెండు ప్రధాన ఓహెచ్‌బీర్‌ ట్యాంకుల నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. మర్పల్లి దగ్గర 40వేల లీటర్ల ట్యాంకు ఇప్పటికే పూర్తికాగా, మాసన్‌పల్లి దగ్గర గల 60వేల లీటర్ల ట్యాంకు నిర్మాణం తుదిదశకు చేరుకుంది. దీంతో పాటు నవల్గ సమీపంలో గల 1.5 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన సంపు, వాటర్‌ట్యాంకు నిర్మాణం కూడా పూర్తయ్యింది. తాండూరు నియోజక వర్గంలో రెండు ట్యాంకులకు మాత్రమే పంపుల ద్వారా నీటిని ఎక్కిస్తారు. వీటిలో మర్పల్లి దగ్గర ఉన్న 40 వేల లీటర్ల ట్యాంకుకు నవల్గ సంపు నుంచి 3 మోటర్ల ద్వారా నీటిని పంపిస్తారు. 

సెప్టెంబర్‌ 15వరకు గ్రామాలకు.. 

ఓట్లు కురిపిస్తాయని భావిస్తున్న మిషన్‌ భగీరథ పథకం నీళ్లు ఈ నెలాఖరు వరకు గ్రామాలకు చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. బషీరాబాద్‌ మండలంలో 39 గ్రామాల్లో రూ.24.51కోట్లతో చేపట్టిన ఇంట్రావిలేజ్‌ పనుల్లో జరుగుతున్న జాప్యం వల్ల పక్షం రోజులు ఆలస్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్‌ 15వరకు గ్రామాల్లోని ట్యాంకులకు నీళ్లను చేర్చాలని యంత్రాంగం పనుల్లో వేగాన్ని పెంచింది. ఇదిలా ఉండగా కృష్ణ వాటర్‌ బషీరాబాద్‌ మండలంలోని నవల్గకు చేరడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు