బంద్‌ ప్రశాంతం

11 Sep, 2018 10:49 IST|Sakshi
బంద్‌తో నిర్మానుష్యంగా మారిన పరకాల పట్టణం

సాక్షి, వరంగల్‌ రూరల్‌: అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ విపక్షాలు భగ్గుమన్నాయి. జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలతో హోరెత్తించారు.  పెరుగుతున్న చమురు ధరలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌తో పా టు టీడీపీ,సీపీఎం,సీపీఐ, ఇతర ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. తెల్లవారుజాము నుంచే విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను నడవకుండా అడ్డుకున్నారు. నర్సంపేట, పరకాల ఆర్టీసీ బస్టాండ్, డిపోల ఎదుట బస్సులు బయటికి రాకుండా నిరసన వ్యక్తం చేశారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని డిమాండ్‌ చేశారు. మండలాల్లో కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు రాస్తారోకోలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.

బంద్‌ సక్సెస్‌.. 
జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో కూడా వ్యాపార వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. హోటళ్లు, సినిమాహాళ్లు ముసివేశారు. ఉదయం పూట ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రైవేటు వాహనాలు నడవలేదు. బంద్‌ కారణంగా ఉదయం విధులకు వెళ్లే ఉద్యోగులు, గమ్యస్థానాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రైవేటు వాహనాల యజమానులు అమాంతం ఛార్జీలను పెంచి ప్రయాణికులను తరలించారు. 

మరిన్ని వార్తలు