ఎక్కడి కక్కడే..

11 Sep, 2018 06:46 IST|Sakshi
వెలవెలబోతున్న ఖమ్మం బస్టాండ్‌ ప్రాంగణం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీతోపాటు వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఖమ్మం డిపో ఎదుట తెల్లవారుజామున బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం బస్టాండ్‌ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పి బస్సులను పంపించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు ఎంతకూ పోలీసుల మాట వినకపోవడంతో కొన్ని బస్సులను డిపోలో.. మరికొన్నింటిని బస్టాండ్‌లో నిలిపారు. కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల నేతలు ఉదయం 9 గంటలకు బస్టాండ్‌ ప్రాంతానికి చేరుకుని ఆందోళనలు నిర్వహించారు. వామపక్షాల ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ యాత్ర నిర్వహించి.. బస్టాండ్‌ ఎదుట దహనం చేశారు. పలువురు కార్యకర్తలు మోదీ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ దహనం చేశారు. కాగా.. డిపో ఎదుట బయటకు వచ్చిన బస్సును అడ్డుకుని డిపోలోకి పంపించాలని నినాదాలు చేశారు.

జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలలు, వ్యాపార వర్గాలు, పెట్రోల్‌ బంక్‌ల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. సినిమా హాళ్లు, బ్యాంకులు, బంగారం, బట్టలు, కిరాణా దుకాణాలను ఆందోళనకారులు బంద్‌ చేయించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని వ్యాపారులు బంద్‌కు మద్దతునివ్వడంతో మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. శాసన మండలి ఉప నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పెరిగిన ధరలకు నిరసనగా జరుగుతున్న బంద్‌లో భాగంగా ఎడ్ల బండిపై నగరంలో ప్రదర్శన నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అనుచర గణంతో బస్టాండ్‌ ప్రాంతానికి చేరుకోగా.. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తన క్యాంపు కార్యాలయం నుంచి ట్రాక్టర్‌ నడుపుతూ రాగా.. కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ కథ సినిమా ట్రైలర్‌లా ఉందని, దీనిని చూసిన వారంతా బాగుంటుందని సినిమాకు వెళ్తే అక్కడ శూన్యమని.. అదే స్థాయిలో కేసీఆర్‌ పరిపాలన ఉందన్నారు.

పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించాలని అనేక సార్లు డిమాండ్‌ చేసినా.. అధికార దాహంతో మోదీతో కలిసి ధరలు తగ్గించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్సీ పొం గులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రూడాయిల్‌ ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఇరు ప్రభుత్వాలు సైతం హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గినా.. మోదీ సర్కార్‌ మాత్రం ధరలు పెంచుతూ పోతోందన్నారు. దీనివల్ల సామాన్యుడిపై మోయలేని భారం పడుతోందని, ధరలు తగ్గించకపోతే ప్రభుత్వాలకు తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సి వస్తోందని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంధన ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయన్నారు.

రోజువారీ ధరల మార్పును తీసుకొచ్చి.. ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ వారికి లాభాలను చేకూర్చేందుకు దేశంలో సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేశారు. బంద్‌లో వివిధ పార్టీల నాయకులు పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, దిరిశాల భద్రయ్య, మద్ది వీరారెడ్డి, రాపర్తి శరత్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఫజల్, రాయల నాగేశ్వరరావు, మేళం శ్రీనివాసయాదవ్, రామిశెట్టి మనోహర్‌నాయుడు, కట్ల రంగారావు, నాగండ్ల దీపక్‌చౌదరి, బాలగంగాధర్‌ తిలక్, టీడీపీ జిల్లా కార్యదర్శి తోటకూరి శివయ్య, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఆవుల అశోక్, పోటు ప్రసాద్, జానీమియా, తాటి వెంకటేశ్వర్లు, ఎర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, కల్యాణం వెంకటేశ్వర్లు, సింహాద్రి యాదవ్, గోపాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
పాక్షికంగా తిరిగిన బస్సులు.. 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బస్సులు పాక్షికంగా తిరిగాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఆందోళనకారులు ఉదయం సమయంలో డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం నుంచి బస్సులు బయటకు వచ్చాయి. మధిర, ఖమ్మం తదితర డిపోల ఎదుట ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 634 బస్సులు ఉండగా.. వాటిలో 190 బస్సులు రద్దు చేశారు. 444 బస్సులు తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బంద్‌ కారణంగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రూ.30లక్షల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలు ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఖమ్మం వచ్చిన ఒకటి, రెండు బస్సులను కాల్వొడ్డు వద్ద అడ్డుకోవడంతో ప్రయాణికులు అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండు, మూడు కిలోమీటర్లు నడిచివెళ్లారు. ఆస్పత్రులకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

జిల్లావ్యాప్తంగా బంద్‌.. 
ఖమ్మం నియోజకవర్గంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో బంద్‌ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. దుకాణాలను బంద్‌ చేయించారు. సినిమా హాళ్లు మూసివేశారు.  చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఖమ్మం–బోనకల్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ముదిగొండలో ఖమ్మం–కోదాడ ప్రధాన రహదారిపై ముదిగొండ సెంటర్‌లో రెండు గంటలపాటు బంద్‌ నిర్వహించారు. ఏన్కూరు ప్రధాన సెంటర్‌ నుంచి సాయిబాబా మందిరం వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్‌లో రాస్తారోకో చేశారు. సుమారు గంటసేపు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం జీపునకు తాడుకట్టి లాగి నిరసన తెలియజేశారు. ఎర్రుపాలెంలో కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్‌ వరకు ఆటోకు తాడుకట్టి లాక్కుంటూ వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు