అద్దె రోగులు.. నకిలీ వైద్యులు!

8 Jan, 2015 03:48 IST|Sakshi
అద్దె రోగులు.. నకిలీ వైద్యులు!
  • ఎంసీఐ అధికారులను బురిడీ కొట్టించిన భాస్కర ఆస్పత్రి
  • అడ్డా కూలీలు, వృద్ధులే రోగులు
  • మొయినాబాద్: అచ్చంగా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ సిని మాలోని సీన్‌ను తలదన్నే వ్యవహారం ఇది. అద్దె రోగులను, నకిలీ వైద్యులను తెచ్చి తనిఖీకి వచ్చిన భారత వైద్య మండలి (ఎంసీఐ) అధికారులను బురిడీ కొట్టించిన ఓ ఆస్పత్రి తీరిది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్ చౌరస్తాలో ఎనిమిదేళ్లుగా 750 పడకలతో భాస్కర వైద్య ఆస్పత్రి, వైద్య కళాశాల కొనసాగుతున్నాయి.

    వైద్య కళాశాలకు అనుమతి రెన్యువల్ నిమిత్తం ఎంసీఐ అధికారులు బుధవారం ఢిల్లీ నుంచి వచ్చారు. వారు వస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు ఆస్పత్రి యాజమాన్యం జాగ్రత్త పడింది. ఆటోలు, అంబులెన్సుల్లో సుమారు వెయ్యి మంది అద్దె రోగులను వివిధ గ్రామాలు, తండాల నుంచి తరలించడమే కాకుండా అడ్డా కూలీలను తీసుకొచ్చి ఆస్పత్రిని నింపేశారు. ఆస్పత్రిలోని ఏ వార్డు చూసినా అద్దె రోగులతో కిక్కిరిసిపోయింది. సదరు కూలీలకు రోజుకు రూ.200, ఒక పూట భోజనం పెట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.

    తనిఖీలు పూర్తయిన వెంటనే ఒప్పందం ప్రకారం వారికి డబ్బులు ఇచ్చి బస్సులు, ఆటోలు, డీసీఎంలలో తిరిగి గ్రామాల్లో వదిలిపెట్టారు. ఈ అద్దె రోగులను చాలా వరకు ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందే సమకూర్చినట్టు తెలిసింది. సిబ్బందిలో కొందరు వైద్యులుగా నటించినట్టు సమాచారం. కొసమెరుపు ఏమిటంటే తనిఖీకి వచ్చిన అధికారులు ఈ తతంగాన్ని పట్టించుకోకుండా సాదాసీదాగా తనిఖీలు చేసుకుని వెళ్లిపోవడం.  
     
    భోజనం పెట్టి రూ. 200 ఇస్తుండ్రు..
    భాస్కర ఆస్పత్రికి వస్తే భోజనం పెట్టి రూ.200 ఇస్తామన్నారు. అందుకే మూడు రోజుల నుంచి వస్తున్న. ఏ రోజు పైసలు ఆ రోజే ఇచ్చేస్తుండ్రు. నన్ను బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్లు వచ్చి అడిగితే జ్వరం వచ్చిందని చెప్పమన్నారు. మా ఊళ్లో నుంచే ముప్పై మందిదాక వస్తున్నం.  
     - రాములు, శ్రీరాంనగర్

మరిన్ని వార్తలు