ఎన్‌ఎంసీ బిల్లు రద్దు చేయాలి

9 Aug, 2019 11:42 IST|Sakshi
హిమాయత్‌ నగర్‌ చౌరస్తాలో రోడ్డుపై కూర్చొ్చని ధర్నా చేస్తున్న భాస్కర ఆసుపత్రి జూడాలు

భాస్కర ఆసుపత్రి జూనియర్‌ వైద్యుల భారీ ర్యాలీ

బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియన్‌ మెడికల్‌ ఆసోసియేషన్‌

పేద విద్యార్థుల ఆశలు గల్లంతయ్యాయని మండిపాటు

జిల్లా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు బంద్‌

సాక్షి, మొయినాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ(నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌) బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాస్కర ఆసుపత్రికి చెందిన జూనియర్‌ వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం మొయినాబాద్‌ మండలంలోని భాస్కర ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇన్‌టెన్స్‌(హౌజ్‌ సర్జరీ) డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు కలిసి భాస్కర ఆసుపత్రి నుంచి హిమయత్‌ నగర్‌ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్తూ ఎన్‌ఎంసీ బిల్లును రద్దు చేయాలని నినదించారు.

హిమయత్‌ నగర్‌ చౌరస్తాలో దాదాపు అరగంట సేపు రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిపివేశారు. ఎన్‌ఎంసీ బిల్లును తీసుకురావడంతో పేద, మధ్యతరగతి వారికి వైద్య విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల ధర్నాతో హిమయత్‌నగర్‌ చౌరస్తాలో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న మొయినాబాద్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకట్, జగదీశ్వర్‌లు సిబ్బందితో కలిసి ధర్నా చేస్తున్నవారిని పక్కకు పంపించి ట్రాఫిక్‌ని పునరుద్ధరించారు. వైద్యులు, విద్యార్థులు తిరిగి ర్యాలీగా భాస్కర ఆసుపత్రికి వెళ్లారు.

బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి: ఐఎంఏ
అనంతగిరి: కేంద్రం ఎన్‌ఎంసీ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐఎంఏ వికారాబాద్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పవన్‌కుమార్‌లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్పత్రుల బంద్‌లో భాగంగా గురువారం వికారాబాద్‌లో బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా పట్టణంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు ఆస్పత్రులను బంద్‌ (అత్యవసర సేవలు మినహాయించి) నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రం ఎన్‌ఎంసీ బిల్లును తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 6 నెలల బ్రిడ్జి కోర్సు పెట్టి వైద్య విద్యార్థుల పొట్ట కొట్టాలని చూస్తుందని మండిపడ్డారు. కేంద్రం వెంటనే 32, 51, 15 సెక్షన్‌లను తొలగించాలన్నారు. ఈ సెక్షన్‌లు అమలైతే 6 సంవత్సరాలు యంబీబీఎస్‌ చదివిన మెడిసిన్‌ విద్యార్థుల చదువుకు విలువ లేకుండా పోతుందన్నారు. ఎలాంటి అర్హతలు లేని వారు 6 నెలల కోర్సుతో ఎలాంటి విధులు నిర్వర్తిస్తారో అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వికారాబాద్‌ ప్రధాన కార్యదర్శి భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు పవన్‌కుమార్, కోశాధికారి హర్షవర్ధన్‌రెడ్డి, ప్రతినిధులు సబితాఆనంద్, భరత్‌కుమార్, రమ్య, దీపా భక్త వత్సలం, సందీప్‌ తదితరులు పాల్గొళన్నారు.

మరిన్ని వార్తలు