కేసీఆర్‌ వారిని శిక్షించకూడదు

31 Aug, 2019 19:09 IST|Sakshi

అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు

పడక ఎక్కిన 500 పడకల కరీంనగర్ పెద్దాసుపత్రి 

చిన్నపిల్లల వార్డులో బెడ్స్, బెడ్ షీట్స్ కరవు

మడత మంచాల్లో రోగులకు చికిత్స

సమీక్ష చేయని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్

రాజకీయ అస్థిరతలో ఆసుపత్రులను పట్టించుకోని మంత్రి  రాజేందర్

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు

సాక్షి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుటుంబ సంక్షేమే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజలను కాపాడాల్సిన పాలకులు వారిని శిక్షించకూడదు అని భట్టి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఇతర సీనియర్ నాయకులతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. అనంతరం మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రులపై..
కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులను భయంకరంగా నిర్వీర్యం చేసిందని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిని నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు  అదనంగా ఒక్క భవనం నిర్మించలేదని, కొత్తగా ఎక్విప్మెంట్ ఇవ్వడంగానీ, మందులు సక్రమంగా సరఫరా చేయడంకానీ చేయలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బెడ్ షీట్స్ కూడా సరిగ్గా అందించక పోవడం దురదృష్ట కరమని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉన్న బెడ్స్ సరిపోక మడత మంచాలు వేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్యులు ఎక్కడ?
కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 350 పడకలు ఉన్నాయి. దీనికి అదనంగా మాత, శిశు సంక్షేమం కింద 150 పడకలను గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. దీనితో మొత్తం ఆసుపత్రిలో పడకల సంఖ్య 500కు చేరింది. ఇందులో కేవలం 200 పడకల ఆసుపత్రిలో ఉండే సిబ్బంది మాత్రమే ఉన్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని భట్టి అన్నారు. సివిల్ సర్జన్స్ 28 మందికిగానూ నలుగురు, 109 మంది నర్సులకుగాను 61 మంది, 13 మంది లాబ్ టెక్నీషియన్స్ ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని వివరించారు. 

మహిళలకు పురుషులతో ఈసీజీ టెస్టులా?
మహిళా రోగులకు పురుషులతో ఈసీజీ పరీక్షలు నిర్వహించే అత్యంత దురదృష్టకర పరిస్తితులు కరీంనగర్ పెద్దాసుపత్రిలో ఉన్నాయి. మేల్ టెక్నీషియన్స్తో ఈసీజీ పరీక్షలు చేయించుకోలేక మహిళలు బయటకు వెళుతున్నారని ఇది అత్యంత బాధాకరమని భట్టి అన్నారు. శానిటేషన్ కు సంబంధించిన స్టాఫ్ కూడా ఎవ్వరు లేరని భట్టి అన్నారు. 

ఆరోగ్యమంత్రికి కనీసం ఆసుపత్రులను పట్టించుకుంటున్నాడా
కరీంనగర్ జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై కనీసం సమీక్ష అయిన చేసారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. జిల్లా ఆసుపత్రిని చూస్తే ఆయన శాఖను పరిశీలిస్తున్నట్లు లేదని అన్నారు. మందులు లేవు, బెడ్ షీట్స్ లేవు, మంచాలు లేవు, కావాల్సిన స్థాయిలో వైద్యులు, ఇతర సిబ్బంది లేరని.. అసలు ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి వీటిని చూస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. 500 పడకల ఆసుపత్రికి తగినంత సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేయాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఆందోళనలో ఆరోగ్య మంత్రి
వైద్య, ఆరోగ్య మంత్రి స్వీయ ఆందోళనలతో శాఖను మర్చిపోయినట్లు ఉన్నదని అన్నారు. కేవలం తన రాజకీయ ఆందోళనలో పడి.. ఇతర విషయలను పట్టించుకోవడం లేనట్లు ఉందని, అందుకే రాష్ట్రం జ్వరాల బారిన పడి ఉందని అన్నారు. ఈటల రాజేందర్కు ఆ పార్టీ అధినాయకత్వానికి వాటాల పంపకంలో వచ్చిన తేడాలకు మాకు సంబంధం లేదు.. మీరు రూ. 5 వేలు లంచం కూడా తీసుకోలేదని చెబుతున్నారు.. ఆది మీరు.. మీ నాయకత్వం తేల్చుకోవాల్సిన విషయం..కానీ అవినీతి మాత్రం జరిగిందని.. మీ నాయకులు ప్రశ్నించడంతో మీరు మనస్తాపం చెందారని భట్టి చెప్పారు. మొత్తం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

>
మరిన్ని వార్తలు