ఎట్టకేలకు ముహూర్తం ఖరారు

5 Mar, 2016 01:58 IST|Sakshi

రేపు ఉదయం 9:30 నుంచి బీబీనగర్ నిమ్స్‌లో సేవలు ప్రారంభం

 సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు బీబీనగర్ నిమ్స్ అవుట్ పేషంట్ విభాగం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 6వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఓపీ సేవలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా, మరో మంత్రి జగదీశ్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. తొలిదశలో భాగంగా అబ్‌స్ట్రక్టీవ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ వంటి సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం నిమ్స్ వైద్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి రాజధానిలోని నిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యుల సేవలనే వినియోగించుకోనున్నారు. బీబీనగర్‌లో ఓపీ సేవల ప్రారంభంతో భువనగిరి సహా నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది.

 తొలి దశలో కొన్ని వైద్యసేవలే...
 నాలుగు అంతస్తుల్లో 400 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనంలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్‌ఐ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులతో పాటు ప్రాథమిక అవసరాల కోసం 700 మంది ఇతర సిబ్బంది అవసరం. నియామకాలు చేపట్టకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రారంభించి అభాసుపాలు కావడం కంటే దశల వారీగా సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు తొలి దశలో బేసిక్ ఓపీ వైద్య సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ కె.మనోహర్ ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు