సిటీలో సైకిల్‌ రాజ్యం!

6 Sep, 2018 07:45 IST|Sakshi

1918లో అందుబాటులోకి...  1938లో షాపులు ప్రారంభం  

1950–2000 వరకు విరివిగా వినియోగం  

నిజాం సంస్థానంలో సైకిళ్లకూ రిజిస్ట్రేషన్‌  

పన్నులూ చెల్లించాల్సిందే... నిబంధనలు అతిక్రమిస్తే చలాన్‌లు  

నిజాం సంస్థానంలో ప్రధాన ప్రయాణ సాధనం సైకిల్‌. అప్పట్లో నగర రోడ్లపై ఎటు చూసినా ఇవే దర్శనమిచ్చేవి. 1918లో హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన సైకిళ్లు... 2000 సంవత్సరం వరకు రాజ్యమేలాయి. అయితేసంస్థానంలో సైకిళ్లకు రిజిస్ట్రేషన్‌ ఉండేది. వినియోగదారులు పన్నులు కూడా చెల్లించేవారు. నిబంధనలు అతిక్రమిస్తేచలాన్‌లు కూడా విధించేవారు. సిటీలో సైకిల్‌ రాజ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి, హైదరాబాద్‌  : యూరోపియన్‌ దేశాల్లో 1860లలోనే సైకిళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ... హైదరాబాద్‌లో 1918 నుంచి వాడుకలోకి వచ్చాయి. అప్పట్లో వీటిని ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆర్డర్‌ ఇచ్చిన మూడు నాలుగు నెలల్లో ముంబైకి వస్తే.. అక్కడి నుంచి రైలు మార్గంలో నగరానికి తీసుకొచ్చేవారు. అయితే తొలుత ఇవి కేవలం ఉన్నత వర్గాలు, ధనిక కుటుంబాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ అధికారులు, పోలీస్‌ల దగ్గర ఉండేవి. 1938లో కోఠి, అబిడ్స్‌ ప్రాంతాల్లో సైకిల్‌ షాపులు ప్రారంభమయ్యాయి. వ్యాపారులు విదేశాల్లో తయారయ్యే సైకిళ్లను ముంబై నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయించేవారు. షాపులు ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రజలకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 1951లో అట్లాస్‌ తదితర కంపెనీలు మన దేశంలో ప్రారంభమవడంతో సైకిళ్ల వినియోగం విరివిగా పెరిగింది.   

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి...  
హైదరాబాద్‌ సంస్థానంలో సైకిల్‌ కొంటే దాన్ని తప్పనిసరిగా బల్దియాలో రిజిస్ట్రేషన్‌ చేయించాలనే నిబంధన ఉండేది. సైకిల్‌ కొనుగోలుకు సంబంధించిన రసీదు, యజమాని చిరునామాతో సహా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించేవారు. బల్దియా అధికారులు సిల్వర్‌ టోకెన్‌పై సైకిల్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్, గడువు వివరాలు మెషిన్‌తో ముద్రించి ఇచ్చేవారు. ఆ సిల్వర్‌ టోకెన్‌ను సైకిల్‌ ముందు భాగంలో అమర్చేవారు. సైకిళ్లకు రిజిస్ట్రేషన్‌ లేని పక్షంలో పోలీసులు జరిమానా విధించడంతోస్వాధీనం చేసుకునేవారు. ప్రతిఏటా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌ చేయించాల్సి ఉండేది. సైకిళ్లు వినియోగించేవారు నిజాం కాలంలో పలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉండేవి. సైకిల్‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు. రాత్రి సమయంలో సైకిల్‌ నడిపితే.. దాని ముందు భాగంలో లాంతర్‌ లైట్‌ తప్పనిసరి ఉండాలి. లాంతర్‌ల అనంతరం డైనమాను వెనక టైరుకు అమర్చి దాని ద్వారా లైట్‌ను వెలిగించేవారు. నిబంధనలు పాటించని పక్షంలో చలాన్‌లు విధించేవారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పోలీసులకు పట్టుబడితే సైకిల్‌ సీజ్‌ చేసేవారు. స్వాతంత్య్రానంతరం 1976 వరకు చలాన్‌ల వ్యవస్థ కొనసాగింది. ఆ తర్వాత దీన్ని ప్రభుత్వం రద్దు చేసింది.  

అలా 50 ఏళ్లు...
1951లో దేశీయ సైకిల్‌ తయారీ కంపెనీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వాడకం విరివిగా పెరిగింది. 2,000 సంవత్సరం వరకు నగర రోడ్లపై సైకిళ్లు రయ్‌మంటూ దూసుకెళ్లాయి. గ్రామాల్లోనూ సైకిళ్ల వినియోగం ఎక్కువగా ఉండేది. అయితే 2,000 సంవత్సరం తర్వాత మోటార్‌ బైక్‌లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు సైక్లింగ్‌పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నగర యువత వారాంతంలో ప్రత్యేకంగా సైక్లింగ్‌ పోటీలు నిర్వహిస్తూ పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు