అడ్డగోలుగా బీఎడ్ సీట్ల అమ్మకం

28 Nov, 2014 00:59 IST|Sakshi
  • మైనారిటీ కాలేజీల్లో మైనారిటీ విద్యార్థులకే రాని సీట్లు  
  • ఫిర్యాదులు రావడంతో ఆరా తీసిన ఉన్నత విద్యామండలి
  • కాలేజీలకు అప్రకటిత సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు
  • చర్యలకు సిద్ధమవుతున్న మండలి  
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్  (బీఎడ్) ప్రవేశాల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. మైనారిటీ కాలేజీల్లో మైనారిటీ విద్యార్థులకే సీట్లు ఇవ్వలేదని వెల్లడైంది. మేనేజ్‌మెంట్ కోటానే కాదు.. కన్వీనర్ కోటాలోని సీట్లను కూడా మైనారిటీయేతర విద్యార్థులకు అడ్డగోలుగా అమ్ముకున్నట్లు తేలింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మైనారిటీ కాలేజీల్లో  ప్రవేశాలకు సంబంధించిన సీట్ల వివరాలను సేకరించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    నిబంధనలను తుంగలో తొక్కి ఒక్కో సీటును రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కన్వీనర్ కోటాలో తమకు సీటు వచ్చినా యాజమాన్యాలు ప్రవేశాలను నిరాకరిస్తున్నాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో స్పందించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశాల గడువును ఈనెల 29వ తేదీ వరకు పెంచింది. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. అయినా మండలి ఆదేశాలను యాజమాన్యాలు తుంగలో తొక్కాయి. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండా కాలేజీలకు అప్రకటిత సెలవులు ప్రకటించి తాళాలు వేసినట్లు తెలిసింది.
     
    సగం సీట్ల అమ్మకం...

    రాష్ట్రంలో 29 మైనారిటీ బీఎడ్ కాలేజీలు ఉండగా, ఒక్కో కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో ఒక్కో కాలేజీలో 75 సీట్ల చొప్పున 2,175 సీట్లు ఉండగా, మేనేజ్‌మెంట్ కోటాలో ఒక్కో కాలేజీలో 25 సీట్ల చొప్పున 725 సీట్లు ఉంటాయి. కన్వీనర్ కోటాలోని 2,175 సీట్లను మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కేటాయించిన మైనారిటీ విద్యార్థులకే ఇవ్వాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మైనారిటీ విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లలో చేరకపోతే ఆ తరువాత నాన్ మైనారిటీ విద్యార్థులకు ఆ సీట్లను కేటాయించాలి.

    కాని కొన్ని యాజమాన్యాలు మినహా మిగతా కాలేజీలు కన్వీనర్ కోటాలో సీటు పొందిన మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు ధర్నా చేసి, మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీంతో ఉన్నత విద్యా మండలి కాలేజీల్లో ప్రవేశాల వివరాలను సేకరించింది. పలు యాజమాన్యాలు తప్పిదాలకు పాల్పడినట్లు అందులో బయట పడ్డాయి.

    కన్వీనర్ కోటాలోని 2,175 సీట్లలో సగం వరకు అమ్ముకున్నట్లు తెలిసింది. పైగా మండలి ప్రవేశాల గడువును పెంచి, సీటు వచ్చిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ఆదేశించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధం అవుతోంది.
     

మరిన్ని వార్తలు