ఏ గ్రామం ఏ రాష్ట్రంలో !?

20 May, 2014 02:09 IST|Sakshi

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను అధికారికం చేసే అపాయింటెడ్ డే అతి సమీపంలోనే ఉంది. ఈతరుణంలో విభజనతో కీలక సంబంధం ఉన్న జిల్లా స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై అధికార యంత్రాంగం కసరత్తును పూర్తి చేసింది. పోలవరం ముంపు ప్రాంతంలోని 136 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో కలపాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న మేరకు ఏ గ్రామాలు ఏ రాష్ట్రంలోకి వెళతాయనే ప్రాతిపదికన జిల్లా స్వరూప చిత్రాన్ని అధికారులు తయారుచేశారు.

 ఈ చిత్రం ఆధారంగా తెలంగాణ, సీమాంధ్రలో కలిసే గ్రామాలపై ప్రత్యేకంగా చర్చించడం కోసం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ మంగళవారం రాజ్‌భవన్‌కు వెళుతున్నారు. అక్కడ గవర్నర్ నరసింహన్‌తో సమావేశమై ముంపు ప్రాంతాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముంపు ప్రాంతాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, రహదారి ఇబ్బందులున్న గ్రామాల పరిస్థితి, ముంపునకు గురయ్యే ప్రజలకు పునరావాసం, ఏ రాష్ట్రం వాటా ఎంత? ఖర్చు ఎవరు భరించాలి... ఎంత భరించాలి అనే అంశాలపై ఈ సమావేశంలో గవర్నర్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి అపాయింటెడ్ డే సమయానికల్లా అన్ని కార్యక్రమాలను  పూర్తి చేయనుంది.

 ఆ గ్రామాలకు వెళ్లేదెలా
 జిల్లాలోని 7 మండలాలకు చెందిన గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న నిర్ణయం మేరకు.... జూన్ 2 నుంచి  136 రెవెన్యూ గ్రామాలు, 211 హాబిటేషన్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో గోదావరి, కిన్నెరసాని, శబరి నదులతో పాటు దట్టమైన అరణ్యం ఉన్న భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ల స్వరూపమే మారిపోనుంది. ఈ పరిస్థితుల్లో అధికారులు తయారు చేసిన చిత్రం చూస్తే... అటు తెలంగాణలో, ఇటు సీమాంధ్రలోకి వెళ్లే 73 గ్రామాలకు కనీసం వెళ్లేందుకు రహదారి కూడా లేదు. గోదావరి ఒడ్డునే ఉన్న కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపగా వీటికి  తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లాల్సి వస్తోంది.

చుట్టూ సీమాంధ్ర గ్రామాలుంటే... కొన్ని గ్రామాలు తెలంగాణలో చూపడంతో తెలంగాణలోని ఆ గ్రామాలకు కూడా రహదారి సౌకర్యం లేకుండా పోతోంది. దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న చోట్ల ఎక్కువ గ్రామాలను తెలంగాణలోనే చూపించగా..., ఇక్కడికి వెళ్లాలన్నా అటవీ ప్రాంతం కంటే ముందున్న సీమాంధ్ర గ్రామాలను దాటి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌తో జరిగే భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది వేచిచూడాల్సిందే. మరోవైపు బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలను తెలంగాణలోనే ఉంచేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది కానీ.... అందుకు సంబంధించిన ఆర్డినెన్స్ మాత్రం రాలేదు.

 దీంతో ఆగ్రామాలను కూడా సీమాంధ్రలో చూపెట్టారు. మరి ఈ గ్రామాలను ఏం చేస్తారన్నది అంతుపట్టడం లేదు. ఒకసారి తెలంగాణ నుంచి సీమాంధ్రకు పంపి, మళ్లీ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్లీ తెలంగాణకు తెస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇక, రహదారి సౌకర్యమే సరిగా లేని ఈ గ్రామాల్లోని ప్రజలకు ఏ ప్రభుత్వం సేవలందించాలి.... పన్నులు ఎలా వసూలు చేయాలి... పున రావాసం ఎవరు, ఎక్కడ కల్పించాలన్న దానిపై కూడా గవర్నర్‌తో జరిగే భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

 ముంపు చిత్రం ప్రకారం జిల్లా నుంచి విడిపోనున్న గ్రామాలివే...
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా జిల్లాలోని 7 మండలాలల్లోని 131 రెవెన్యూ గ్రామాలు  సీమాంధ్రలో విలీనమవుతున్నాయి. భద్రాచలం డివిజన్‌లో 98 రెవెన్యూ గ్రామాలు, పాల్వంచరెవెన్యూ డివిజన్‌లో 38 రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలో కలుస్తున్నాయి.
 భద్రాచలం మండలలో పది రెవెన్యూ గ్రామాలు, 13 హేబిటేషన్స్..., కూనవరం మండలంలో 39 రెవెన్యూ గ్రామాలు, 48  హేబిటేషన్స్.., చింతూరు మండలంలో 14 గ్రామాలు, 17  హేబిటేషన్స్..., వి.ఆర్.పురం మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు, 45  హేబిటేషన్స్ సీమాంధ్రలో కలవనున్నాయి. పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బూర్గంపాడు మండలంలో 7 రెవెన్యూ గ్రామాలు, 15 హబిటేషన్లు...., వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలు, 39 హబిటేషన్లు..., కుక్కునూరు మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు, 34 హబిటేషన్లు సీమాంధ్రలో పరిధిలోకి వెళ్లనున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా