దిగొచ్చిన గ్యాస్‌ ధర..!

4 May, 2020 10:08 IST|Sakshi

ఒక్కో సిలిండర్‌పై  రూ. 214 తగ్గింపు

సాక్షి, నాగారం (నల్గొండ) : పేద, సామన్య ప్రజలకు ఊరట. లాక్‌డౌన్‌ కారణంగా అధిక ధరలతో అవస్థలు పడుతున్న ప్రజలకు వంట గ్యాస్‌ ధర తగ్గడంతో కాస్త ఉపశమనం లభించింది. వంట గ్యాస్‌ ధరలు తగ్గడంతో జిల్లాలో 3,24,567 మందికి ప్రయోజనం చేకూరనుంది.  తగ్గిన వంట గ్యాస్‌ ధరలు మే నెల నుంచే అమలులోకి వచ్చాయి.  ఏప్రిల్‌ నెలలో గృహ అవసరాల సిలిండర్‌ ధర రూ.818 ఉండగా ప్రస్తు తం రూ.214లు తగ్గి రూ.604లకు లభిస్తోంది. గతంలో కమర్షియల్‌ సిలిండర్‌ (నాన్‌డొమెస్టిక్‌) ధర రూ. 1,495 ఉండగా రూ.101 తగ్గి  ఇప్పుడు రూ.1,394కు లభిస్తోంది. లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పడిపోవడంతో గ్యాస్‌ ధరలు దిగొచ్చాయి. గ్యాస్‌ ధరలు తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో ఇలా...
జిల్లాలో మొత్తం 3,24,567 గ్యాస్‌కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సింగిల్‌ సిలిండర్‌ 1,90,508, డబుల్‌ సిలిండర్‌ 50,532, దీపం పథకం11,576, కార్పొరేషన్‌ రెస్పాన్స్‌బులిటి (సీఎస్‌ఆర్‌) 61,369, ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు 10,582 ఉన్నాయి. 

చార్జీల పేరిట దోపిడీ....
గ్యాస్‌ఏజన్సీల నిర్వాహకులు రవాణా చార్జీల పెరిట వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 25 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్‌ సంస్థలు ప్రతినెలా వినియోదారులకు గ్యాస్‌ సరఫరా చేస్తున్నాయి. గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రవాణా చార్జీల పేరుతో ఒక్కోగ్యాస్‌ సిలిండర్‌పై అదనంగా రూ.30నుంచి రూ.60వరకు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. 

గ్యాస్‌ ధర తగ్గింపుతో ఊరట 
కరోనా లాక్‌డౌన్‌తో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.  వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.214లు తగ్గించడంతో పేదలకు ఎంతో ఊరట కలుగుతుంది. ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను తగ్గించడం పట్ల ఆనందంగా ఉంది. 
–మల్లెపాక వెంకన్న, ఆటోడ్రైవర్, లక్ష్మాపురం 

గ్యాస్‌రేటు తగ్గడం హర్షణీయం
లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో  ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలు తగ్గించడం సామాన్యులకు ఎంతో మేలు. వంట గ్యాస్‌ ధరలు తగ్గించడం హర్షణీయం. 
–మామిడి ధనమ్మ, గృహిణి, పసునూర్‌

ఈనెల నుంచే అమలు  
జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల ధరలు తగ్గాయి. ఈ రేట్లు ఈనెల–1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. రూ.604లకే 14కేజీల డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు లభిస్తోంది. అలాగే వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా వస్తుంది.  
–విజయలక్ష్మి, డీఎస్‌ఓ, సూర్యాపేట 

మరిన్ని వార్తలు