తమ్ముడు జైలుకెళ్లాడని అన్న ఆత్మహత్య

11 Dec, 2014 03:19 IST|Sakshi
తమ్ముడు జైలుకెళ్లాడని అన్న ఆత్మహత్య

జైపూర్ : తమ్ముడు జైలుకెళ్లాడని అన్న ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని పెగడపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుటుంది. ఏఎస్సై శ్రీనివాస్‌రావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెగడపల్లి గ్రామానికి చెందిన చినూరి అంజిరెడ్డి, సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి అంజిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

పెద్ద కుమారుడు రంజిత్‌రెడ్డి(24) మంచిర్యాలలో డిగ్రీ పూర్తి చేసి చెన్నైలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రంజిత్‌రెడ్డి తమ్ముడు జైపూర్ విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఇటీవల జైపూర్ విద్యుత్ ప్లాంటులో ఉద్యోగాలు ఇప్పించి డబ్బులు వసూలు చేశాడనే నెపంతో రవిపై కరీంనగర్ జిల్లా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

దీంతో పోలీసులు రవి(22)ని రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రంజిత్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. మంగళవారం గోదావరిఖని కోర్టుకు పేషీ నిమిత్తం వచ్చిన రవిని తండ్రి అంజిరెడ్డి, సోదరుడు రంజిత్‌రెడ్డి కలిశారు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన రంజిత్‌రెడ్డి తమ్ముడు జైలుకి వెళ్లిన విషయం జీర్ణించుకోలేక మనస్తాపం చెందాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా మంచిర్యాలకు తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో అక్కడి వైద్యులు కరీంనగర్‌కు రెఫర్ చేశారు. కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా 12 గంటలకు మార్గమధ్యలో మృతిచెందినట్లు వారు తెలిపారు. కొడుకా ఎంత పనిచేస్తివి.. మేము ఎవరి కోసం బతకాలి అంటూ తల్లి సరోజన కన్నీరుమున్నీరులా రోదించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు