బిహారీల దాదాగిరి

31 Aug, 2018 07:54 IST|Sakshi
రైల్వేస్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న బిహార్‌ యువకులు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో హల్‌చల్‌

పార్కింగ్‌ స్థలం ఖాళీ చేయమన్నందుకు ఆందోళన

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదుట బిహారీ యువకులు దాదాగిరీ చేశారు. పార్కింగ్‌ సిబ్బంది వారిని అడ్డుకున్నందుకు ఆందోళనకు దిగారు. దీంతో గురువారం సాయంత్రం కొద్ది సేపు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదుట వాహనాల రాకపోకలు స్తంభించి గందరగోళం నెలకొంది. ఆర్మీ, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీతోపాటు గోపాలపురం పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడినుంచి పంపివేశారు. వివరాల్లోకి వెళితే..రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్ష రాసేందుకు బిహార్‌కు చెందిన యువకులు వందల సంఖ్యలో  నగరానికి వచ్చారు. పరీక్ష ముగిసిన అనంతరం స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ట్రైన్‌ వచ్చేందుకు సమయం ఉండడంతో స్టేషన్‌ ముందు ఉన్న పెయిడ్‌ పార్కింగ్‌ స్థలంలో సేదతీరే ప్రయత్నం చేశారు.

ఇందుకు అభ్యంతరం చెప్పి పార్కింగ్‌ సిబ్బంది స్టేషన్‌లోపలికి వెళ్లి వెయిటింగ్‌రూంలో వేచి ఉండాలని సూచించాడు. రైలు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామని భీష్మించుకున్న ఓ యువకుడు పార్కింగ్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాటామాటా పెరిగి ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో బిహారీ యువకులందరూ అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. గొడవకు కారణమైన యువకుడిని గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, వారు పోలీసు వాహనానికి అడ్డుగా నిల్చుని నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో గందరగోళం నెలకొంది. ఆర్మీ సిబ్బంది. వివిధ విభాగాల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైలు వచ్చేవరకు 6వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆసీనులు కావాలని రైల్వే అధికారులు అనుమతించడంతో వారు స్టేషన్‌లోపలికి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు