బైక్‌ రైడర్‌.. ఫుడ్‌ ‘డ్రైవ్‌’ర్‌

8 Mar, 2019 10:35 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా, ఇంట్లోవారి ఆలనాపాల చూస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఓ డ్రైవింగ్‌ స్కూల్‌ నడుపుతూ ఔత్సాహిక మహిళలు, యువతులకు బైక్‌ డ్రైవింగ్‌లో శిక్షణనిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అర్చన చిగుళ్లపల్లి ఓ పార్శం మాత్రమే ఇది. ఎంబీఏ చదివి ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. ఐటీ కంపెనీలో సేవలందించారు. మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌లో తన సత్తా నిరూపించుకున్నారు.

అయితే, ఆమె.. బైక్‌ రైడర్‌గా మారి నిరుపేదల ఆకలి తీర్చేందుకు ‘ఫుడ్‌ డ్రైవ్‌’ మొదలు పెట్టారు. ఒంటరిగా ప్రయాణిస్తూ ఎక్కడ పార్టీలు, వేడుకలు జరిగినా అక్కడ మిగిలిన పదార్థాలను సేకరించి కొన్ని ఎన్‌జీఓలతో కలిసి బస్తీల్లోని పేదలకు అందిస్తున్నారు. ‘చిన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన నా స్కూల్‌ ఫ్రెండ్‌ కోసం మా అమ్మ రెండు బాక్స్‌లు కట్టి ఇచ్చేది. మరొకరి ఆకలి తీర్చడం అప్పుడే అలవాటైంది. ఇప్పుడదే వ్యాపకంగా మారింది. ఏడాదంతా ఫుడ్‌ డ్రైవ్స్‌ చేస్తాను. 24/7 రెడీగా ఉంటాను’ అంటున్నారామె. 

బైక్‌ డ్రైవింగ్‌లో శిక్షణ  
‘బైక్‌పై ఫుడ్‌ సేకరించడానికి వెళుతుంటే కొందరు ఆశ్చర్యపోతున్నారు. మహిళలు సహజంగా శక్తిమంతులు. అది బైక్‌ రైడింగ్‌లో నిరూపించవచ్చని నా నమ్మకం. అందుకే స్కూల్‌ డేస్‌ నుంచే ఆసక్తి ఉన్న మహిళలకు బైక్‌ నేర్పడం మొదలుపెట్టాను. ముఖ్యంగా చాలా మంది వర్కింగ్‌ లేడీస్‌కి ఫ్రీగా నేర్పించాను. బైక్‌ రైడింగ్‌ శిక్షణ కోసం ఇతర రాష్ట్రాల  నుంచి కూడా విద్యార్ధులు నా దగ్గరకి వస్తుంటారు’ అని వివరించారు అర్చన.

మరిన్ని వార్తలు