‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’

15 Mar, 2019 16:04 IST|Sakshi
బిలాల్‌పూర్‌లో చరిత్రకు ఆనవాలుగా నిలిచిన బురుజు

సాక్షి, కోహీర్‌(జహీరాబాద్‌): దాదాపు ప్రతీ ఊరు పేరు వెనుక ఒక చరిత్ర ఉంటుంది. మండలంలోని బిలాల్‌పూర్‌ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. అదే ఒక గజదొంగ పేరిట గ్రామం వెలిసింది. ఆ పేరే సినీ దర్శకులు నాగసాయి, నిర్మాత మహాంకాళి శ్రీనివాస్‌లకు నచ్చింది. ఇంకేముంది, వర్ధమాన నటులు మాగంటి శ్రీనాథ్, మేఘన నటించిన ‘బిలాల్‌పూర్‌ పోలిస్టేషన్‌’ గా రూపుదిద్దుకొని నేడు విడుదలకు సిద్ధమైంది. మండల కేంద్రమైన కోహీర్‌కు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాల్‌పూర్‌ గ్రామానికి చరిత్ర ఉంది.

నాలుగు వందల సంవత్సరాల క్రితం బిలాలోద్ధీన్‌ అనే గజదొంగ తన శత్రువుల నుంచి రక్షణకోసం బురుజు నిర్మించుకొని చుట్టూ కందకం ఏర్పరచుకొని తన అనుచరులతో కలిసి నివసించేవాడు. శత్రువుల నుంచి రక్షణ నిమిత్తం తోపులను ఉపయోగించేవారు. ఎల్లప్పుడూ కందకంలో నీరు నింపి ఉంచేవారు.తమ శత్రువులు కందకం దాటి వచ్చేలోపు మట్టుబెట్టేవారు. (ఇప్పటికినీ బురుజును, కందకాన్ని చూడవచ్చు) కొన్నాళ్లకు బిలాలోద్ధీన్‌ అంకం ముగిసింది. గజదొంగ బిలాలోద్ధీన్‌ నివాసించడం చేత గ్రామానికి బిలాల్‌పూర్‌ లనే పేరు స్థిరమైనది.

వందేళ్ల క్రితం బురుజు వద్ద మైసమ్మగుడి కట్టారు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్నారు. అయితే గత సంవత్సరం సినిమా షూటింగ్‌ను యాక్షన్, కామెడీ సినిమాను మండల కేంద్రమైన కోహీర్‌తో పాటు బిలాల్‌పూర్, బడంపేట, దిగ్వాల్‌ పరిసర ప్రాంతాల్లో నిర్మించారు.ఇందులో స్థానికులు శివమూర్తి స్వామి, ప్రభుగారి శుభాష్‌తో పాటు బడంపేట గ్రామస్తులు నటించారు. పోలీసుల జీవన ప్రధానంగా తీసిన చిత్రానికి బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ అని పేరు పెట్టారు. జహీరాబాద్‌లోని మోహన్‌ టాకీసులో సినిమాను నేడు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. 
 

మరిన్ని వార్తలు