‘క్యూ - నెట్’ కేసులో మైఖేల్ ఫెరీరా అరెస్టు

20 Oct, 2016 02:34 IST|Sakshi
ఫెరీరాను కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు

మరో ముగ్గురు డెరైక్టర్లు కూడా...
మైఖేల్ ఫెరీరా పద్మభూషణ్ గ్రహీత.. బిలియర్డ్స్ మాజీ చాంపియన్
ముంబై నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన సీసీఎస్ పోలీసులు
అరెస్టును సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిందితులు
కేసులో తదుపరి చర్యలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్: క్యూ-నెట్ మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో లక్షలాది మందిని మోసగించిన కేసులో ప్రమేయంపై ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్, పద్మభూషణ్ అవార్డుగ్రహీత మైఖేల్ జోసఫ్ ఫెరీరా (78)తోపాటు మరో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మందిని రూ. 700 కోట్లకు మోసగించిన క్యూ-నెట్ సంస్థకు భారత్‌లో అనుబంధంగా ఏర్పాటైన విహాన్ డెరైక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఫెరీరాతోపాటు ముంబై, బెంగళూరు ప్రాంతాలకు చెందిన మాల్కమ్ నోజర్ దేశాయ్, మగర్‌లాల్ వి.బాలాజీ, వి.శ్రీనివాసరావులు డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.

ఇప్పటికే ముంబైలో నమోదైన ఈ తరహా కేసులో పోలీసులకు లొంగిపోయిన ఫెరీరా, మిగతా ముగ్గురు నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేశామన్నారు. హాంకాంగ్‌కు చెందిన ఓ సంస్థ గతంలో క్వెస్ట్ నెట్ పేరుతో ఎంఎల్‌ఎం స్కీముల్ని నడిపిందని, దీనిపై అనేక కేసులు నమోదు కావడంతో పేరును క్యూ-నెట్‌గా మార్చుకుందన్నారు. భారత్‌లో వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతల్ని ‘విహాన్’ సంస్థకు అప్పగించిందన్నారు. అందుకే ఈ కేసులో ఫెరారీ, ఇతరులను నిందితులుగా చేర్చామన్నారు. ఏసీపీ జోగయ్యతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహంతి ఈ వివరాలు వెల్లడించారు.

మరోవైపు ఫెరీరా, ఇతరులపై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు బుధవారం నిలిపేసింది.  కేసును కొట్టేయాలంటూ ఫెరీరా, ఇతరులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు. విహాన్ సంస్థలో ఫెరీరా డెరైక్టర్ మాత్రమేనని, ఆ కంపెనీ రోజు వారీ వ్యవహారాలతో ఆయనకు సంబంధం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఐదు లక్షల మంది బాధితులు...
టూర్స్ అండ్ ట్రావెల్స్, హాలిడే ప్యాకేజెస్, వైద్య ఉత్పత్తుల పేరుతో పలువురిని ఆకర్షించిన ‘క్యూ నెట్’ వివిధ స్కీముల్ని ఏర్పాటు చేసింది. రూ. 30 వేలు కట్టి సభ్యులుగా చేరిన వారు మరికొందరిని చేర్చుకుంటూ వెళ్లాలని పేర్కొంది. కొత్తగా చేరే ప్రతి వ్యక్తి కట్టిన నగదు నుంచి ఆ చైన్‌లో అంతకు ముందు కట్టిన వారికి కమీషన్ ఇస్తూ వచ్చింది. ఇలా చైన్‌ను విస్తరించుకుంటూ వెళ్లారు. తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీల్లోనూ కార్యకలాపాలు సాగించిన క్యూ నెట్ సంస్థ దాదాపు 5 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుని రూ.700 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా. ఈ సభ్యుల్లో కొందరికి నగదు తిరిగి రాకపోవడం, సంస్థ ఇచ్చిన హాలిడే ప్యాకేజెస్ చెల్లకపోవడంతో వారు పోలీసుల్ని ఆశ్రయిస్తూ వచ్చారు. ముంబైలో 2013లో ఓ కేసు నమోదవగా గతేడాది హైదరాబాద్ సీసీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు