కాసులు లేక..కదలని రోడ్ల పనులు

8 Jan, 2019 03:25 IST|Sakshi

తారు కొనుగోలుకే అవస్థలు

నేటికీ విడుదల కాని బిల్లులు

బ్యాంకుల నోటీసులతో కాంట్రాక్టర్ల బెంబేలు 

ఆర్‌ అండ్‌ బీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకుల మీనమేషాలు 

తక్షణావసరంగా కనీసం రూ.2,000 కోట్లు కావాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు నిధుల సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం  తక్షణావసరంగా ఆర్‌ అండ్‌ బీకి కనీసం రూ.2000 కోట్లయినా  అవసరమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం పాత బకాయిలను చెల్లించకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో కాంట్రాక్టర్లు గందరగోళంలో పడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అయినా తమకు నిధుల కొరత తీరుతుందని అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు భావించారు. అయితే వాటిపై ఎలాంటి కదలికా లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కాంట్రాక్టర్లు బ్యాంకర్ల నుంచి తెచ్చిన అప్పుల కోసం నోటీసులు వస్తున్నాయని బెంబేలెత్తున్నారు. ఈ కారణంగా వారు పలు చోట్ల రోడ్డు పనులను నిలిపేస్తున్నారు. తమ వద్ద తారు కొనుగోలుకు కూడా డబ్బులు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరి పెండింగు బిల్లుల విషయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారు.  సకాలంలో డబ్బులు కట్టకపోతే టిప్పర్లు, లారీలు ఇతర సామగ్రిని సైతం సీజ్‌ చేసి తీసుకెళతామని బ్యాంకు అధికారులు తమను  హెచ్చరిస్తున్నారని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. 

రుణానికి ప్రభుత్వమే పూచీకత్తు.. 
వాస్తవానికి 2018–19 బడ్జెట్‌లో ఆర్‌ అండ్‌ బీకి వాస్తవానికి రూ.5,600 కోట్లు కేటాయించింది. ఆ మేరకు నిధులు విడుదల జరగలేదు. సంక్షేమ పథకాల నిర్వహణకు ఆ శాఖ నిధులను ప్రభుత్వం మళ్లించిందని సమాచారం. మరోవైపు దాదాపు ఈ శాఖ పరిధిలో దాదాపు రూ.20వేల కోట్లకుపైగా పనులను వివిధ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో వీరికి బిల్లులు విడుదల జరగలేదు. దీంతో ఒక దశలో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీంతో రూ.3000 కోట్లు అప్పు తీసుకోమని ప్రభుత్వం సూచించింది. తానే పూచీకత్తు ఇస్తానని కూడా చెప్పింది. దీనికోసం పలు బ్యాంకుల చుట్టూ తిరిగిన ఆర్‌ అండ్‌ అధికారులు ఎట్టకేలకు ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను ప్రసన్నం చేసుకోగలిగారు. మొత్తానికి రూ.వెయ్యి కోట్లు వచ్చాయి. కానీ, ప్రభుత్వ రద్దుతో ఆ రూ.2000 కోట్లు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా..రోడ్లు భవనాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో అప్పుపై బ్యాంకు లు మీమాంసలో పడ్డాయని సమాచారం. 

తక్షణం రూ.2వేల కోట్లు అవసరం... 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అప్పు పుడుతుందనుకున్న అధికారుల ఆశలపై బ్యాంకులు నీళ్లు చల్లాయి. శాఖ ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో అప్పు ఇచ్చేందుకు వెనకాముందు ఆడుతున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు  ప్రభుత్వం నుంచి రూ.1000 కోట్లు విడుదల చేస్తే కానీ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. మరోవైపు బ్యాంకులు కనీసం వెయ్యి కోట్లు విడుదల చేస్తేనే పనులు ముందుకు కదులుతాయని స్పష్టంచేస్తున్నారు.

గతంలో నూ పలుమార్లు చర్చలు జరిపినా..
గతంలో ప్రభుత్వం తరఫున అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్‌ పలుమార్లు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు. వారికి నిధులు విడుదల చేస్తామని ప్రతీసారి హామీలైతే ఇవ్వగలిగారు గానీ, అవి అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖకు మంత్రి కూడా లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇటు అధికారులు, అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు