డిగ్రీకీ బయోమెట్రిక్‌  

25 Jul, 2018 14:20 IST|Sakshi
బయోమెట్రిక్‌ విధానం

లక్ష్మణచాంద(నిర్మల్‌) : డిగ్రీ స్థాయికి వచ్చాక విద్యార్థులు చదువుపై కాకుండా సరదాలపై ఆసక్తి చూపుతుంటారు. కళాశాలకు సరిగా రారు. దీంతో ఎక్కువ మంది పరీక్షల్లో ఫెయిలవుతూ ఉంటారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

ఈ విద్యా సంవత్సరం (2018–19) నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో వేలిముద్ర హాజరు (బయోమెట్రిక్‌) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కళాశాలలకు ఇప్పటికే ఉత్తర్వులు సైతం అందాయి. విద్యార్థుల హాజరు వివరాలు సంబంధిత విశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఈ–పాస్‌ విధానానికి అనుసంధానం చేయనున్నారు.

 గైర్హాజరు నివారించేందుకు 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు 104 ఉన్నాయి. ఇందులో 16వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే హాజరు విషయంలో అధికారులు, ఆయా కళాశాలల యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించకపోవడంతో చాలా మంది గైర్హాజరవుతున్నారు.

కొంతమంది స్వయం ఉపాధి పొందుతూ విద్యాభ్యాసం చేస్తున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు కళాశాలలకు వెళ్లినా తరగతులకు హాజరుకావడం లేదు. పరీక్షల సమయం వచ్చినప్పుడు లేదా ఉపకార వేతనాల దరఖాస్తుల సమయంలోనే కనిపిస్తున్నారు.

సంబంధిత యాజమాన్యాల సహకారంతో ఆ సమయంలో 75 శాతం హాజరు ఉండేలాగా చూసుకునేవారు. ఈ పరిస్థితికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. 

బయోమెట్రిక్‌తో హాజరు నమోదు 

ప్రస్తుతం అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో డిగ్రీలోనూ అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రతీ కళాశాలలో బయోమెట్రిక్‌ పరికరాలు సిద్ధం చేయాలని ఇప్పటికే విద్యాశాఖ ఆయా కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థుల పేర్లు, కోర్సు, విద్యా సంవత్సరం తదితర వివరాలను ఇందులో నమోదు చేస్తారు. వీటి ఆధారంగా ప్రతీ రోజు విద్యార్థుల హాజరును వేలిముద్రల ద్వారా నమోదవుతోంది. ఈ వివరాలను మార్చేందుకు అవకాశం లేకపోవడంతో ఇకపై కళాశాలలకు రాకుండా నిర్ణీత హాజరుశాతం పొందడం విద్యార్థులకు కష్టమే. 

అధ్యాపకులకూ వర్తింపు 

ఈ హాజరు విధానం కేవలం విద్యార్థులకే కాకుండా అ«ధ్యాపకులకూ వర్తింపజేయనున్నారు. విద్యార్థుల హాజరు సక్రమంగా లేకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ కళాశాలల్లో అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. తనిఖీల సమయంలో, ఇతర అవసరాల్లో అప్పటికప్పుడు తాత్కాలిక సిబ్బందిని నియమించి ఎలాగోలా నెట్టుకొచ్చేవారు.

ఈ విషయం ఉన్నత విద్యామండలికి తెలిసినా ఏమి చేయలేని పిరిస్థితి. అయితే ఇకపై అలా కుదరదు. బోధన, బోధనేతర సిబ్బందిని తప్పనిసరిగా నియమించుకోవాల్సిందే. ప్రైవేట్‌లోనే కాదు.. ప్రభుత్వ కళాశాలల్లోను ఖాళీగా ఉన్న పోస్టులను శాశ్వత లేదా ఒప్పంద, పొరుగు సేవల విధానంలో నియమించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ తీసుకున్న నూతన నిర్ణయంతో ఇక అన్ని కళాశాలల్లోను పూర్తి స్థాయిలో అధ్యాపకులు అందుబాటులోకి వస్తారు. బోధన మెరుగుపడి విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. 

హాజరు లేకుంటే ఉపకారవేతనాలు కట్‌.. 

విద్యార్థుల హాజరు 75శాతం లేకుంటే ఉపకార వేతనాలు మంజూరు అయ్యే అవకాశం ఉండదు. ఈమేరకు తమ పిల్లలు సక్రమంగా కళాశాలకు హాజరు అయ్యేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేకుంటే ఆర్థిక భారం తప్పకపోవచ్చు.  

యాజమాన్యాల ఆందోళన 

విద్యాశాఖ నిర్ణయంతో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలలో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు విద్యార్థులు కళాశాలకు రాకున్నా హాజరు అయినట్లుగా ఆన్‌లైన్‌లో నివేదికలు నమోదు చేసేవారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు, బోధన రుసుములు సులభంగా పొందేవారు.

ప్రస్తుతం విద్యార్థుల హాజరు తప్పనిసరి కావడంతో వారంతా అయోమయంలో పడిపోయారు. విద్యార్థుల హాజరు నిర్దేశిత ప్రకారం లేకుంటే పరీక్షలకు అనుమతించే అవకాశం ఉండదు. ఉపకార వేతనాలు పొందడానికి విద్యార్థుల వివరాలు సిఫారసు చేయరాదు. పైగా కళాశాల రుసుముల చెల్లింపుకోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది.

కళాశాలకు సక్రమంగా రాని విద్యార్థుల ఫీజులు చెల్లిస్తారనే గ్యారంటీ కూడా ఉండదు. ఒకవేళ డిటెన్షన్‌కు గురి అయితే పైతరగతులకు అనుమతించరు. ఫలితంగా ఉపకార వేతనాల జారీ నిలిచిపోతుంది.

బయోమెట్రిక్‌కు ఏర్పాట్లు 

డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేందుకు గాను ఈ విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థుల వివరాలు జియోట్యాగింగ్‌ చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చు. అప్పటి వరకు అన్ని కళాశాలలో బయోమెట్రిక్‌ పరికరాలు సిద్ధం చేసుకోవాలని ఇటీవల ప్రిన్సిపాళ్ల మీటింగ్‌లో తెలియజేసాం.          

    – పురుషోత్తం, రిజిస్ట్రార్, కాకతీయ యూనివర్సిటీ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా