‘మీ–సేవ’లో బయోమెట్రిక్‌

2 Aug, 2019 12:28 IST|Sakshi

కేంద్రానికి నిర్వాహకుడి వేలిముద్ర ఉండాల్సిందే  

ఏ పొరపాటు జరిగినా అతడే బాధ్యుడు

గ్రేటర్‌లో అధికారికంగా 447 కేంద్రాలు  

సగానికి పైగా బినామీల చేతుల్లోనే.

సాక్షి,సిటీబ్యూరో: ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే అన్ని కార్యకలాపాల సేవలకు కేంద్ర బిందువు మీ–సేవా కేంద్రాలే. విద్యుత్‌ బిల్లు చెల్పింపు నుంచి పాస్‌పోర్టు నమోదు దాకా.. రెవెన్యూ సేవలను ఇక్కడి నుంచి పొందాల్సిందే. అయితే, ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఏర్పాటైన ఈ కేంద్రాలు చాలావరకు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల వివిధ సేవలకు ఇష్టానుసారం ఫీజులు, సర్వీస్‌ చార్జీల వసూలు చేస్తున్నారు. ఇకపై ఇలాంటి దందాలకు, వసూళ్లకు ప్రభుత్వం చెక్‌ పెట్టే ఏర్పాట్లు చేసింది. కేంద్రాల నిర్వహణలో ఏ చిన్నపాటి తప్పిదం జరిగినా దానికి ఆ కేంద్రం యాజమానే (లైసెన్స్‌దారు) బాధ్యత వహించాలి. ఇందుకోసం మీ–సేవా కేంద్రాల నిర్వాహణలో ‘బయోమెట్రిక్‌’ విధానం ప్రవేశపెట్టారు. కేంద్రం యాజమాని బయోమెట్రిక్‌ యంత్రంపై వేలిముద్ర వేస్తేనే మీ–సేవా సర్వీసులు అందించేందుకు వీలవుతుంది. దీంతో హైదరాబాద్‌ మహా నగరంలో సగానికి పైగా బినామీల నిర్వాహణలో కొనసాగుతున్న కేంద్రాలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సేవలకు సంబంధించి వినియోగదారుల వద్ద ఇష్టానుసారం చేస్తున్న వసూళ్లకు కూడా అడ్డుకట్ట పడనుంది.

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సగానికి పైగా మీ–సేవా కేంద్రాలు బినామీల నిర్వాహణలో సాగుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా 447 ఆన్‌లైన్‌ కేంద్రాలు ఉండగా, అందులో టీఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీసులు 198, ప్రభుత్వ ఈ–సేవా సర్వీసులు 26, తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) కేంద్రాలు 220 ఉన్నాయి. తాజాగా మరో 70కి పైగా కొత్త కేంద్రాలు మంజూరు చేయనున్నారు. మొత్తంమీద ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల్లో సగానికి పైగా లైసెన్స్‌ పొందినవారి చేతుల్లో లేనట్లు తెలుస్తోంది. బయోమెట్రిక్‌ విధానంతో కేంద్రం యాజమాని తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో సదరు బినామీ నిర్వాహకులు చిక్కుల్లో పడినట్లే.

ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు మీ–సేవా కేంద్రాలను బయోమెట్రిక్‌తో అనుసంధానం చేశారు. మీ–సేవా కేంద్రం యాజమానితో పాటు ఒక ఆపరేటర్‌ మాత్రమే బయోమెట్రిక్‌ విధానంలో ఆన్‌లైన్‌ సేవలు అదించేలా ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ రూపొందించారు. బయోమెట్రిక్‌  ద్వారా వేలిముద్ర వేయగానే రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేస్తేనే ఆన్‌లైన్‌ సేవలు ముందుకు వెళ్తాయి. కేంద్రం నిర్వాహకుడు(యాజమాని) బయోమెట్రిక్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మీ–సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది.

మీ–సేవా ద్వారానే అన్ని సేవలు
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలన్నింటినీ మీ–సేవా కేంద్రాల ద్వారానే కొనసాగుతున్నాయి. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ప్రజాపంపిణీ, రిజిస్ట్రేషన్, రోడ్డు రవాణ, కార్మికశాఖ, విద్యుత్, వైద్య, విద్య, సంక్షేమ, పోలీసు, వాణిజ్య పన్ను తదితర శాఖల సేవలు మీ–సేవా ద్వారానే అందుతున్నాయి. దీంతో మీ–సేవా కేంద్రాలకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా కుప్పలు తెప్పలుగా గల్లీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి కొందరు ఉపాధి కోసమని మీ–సేవా కేంద్రాలను మంజూరు చేయించుకొని ఇతరులకు విక్రయించడం, లీజు, అద్దె, కమీషన్‌ పద్ధతిపై ఇతరులకు అప్పగించడం పరిపాటిగా మారింది. దీంతో కేంద్రాల నిర్వాహకులు సేవలందించేందుకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు మీ–సేవా కేంద్రాల ముసుగులో అక్రమ దందా కూడా సాగుతున్న ఉదాంతాలు అనేకం వెలుగు చూశాయి. కేంద్రాల అక్రమ వసూళ్లు అధికారుల దృష్టికి వెళ్తే ఆపరేటర్లు తప్పిదం చేశారని యాజమానులు కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. తాజగా వచ్చిన బయోమెట్రిక్‌ విధానంతో బినామీలు కేంద్రాలు నిర్వహించేందుకు వీలుండదు. ఆపరేటర్‌ వెసులుబాటునివినియోగించుకుంటే వారు చేసే అక్రమాలకు, అధిక వసూళ్లకు సదరు యాజమానే బాధ్యత వహించాలి.  

పారదర్శకత కోసమే..
మీ–సేవా కేంద్రాల నిర్వాహణతో పాటు పార్శదర్శకంగా సేవలందించేందుకు బయోమెట్రిక్‌ విధానం తీసుకొచ్చాం. దీంతో బినామీల నిర్వహణకు వీలుండదు. ప్రజలకు అందించే సేవలకు అధిక చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. చిన్నపాటి తప్పిదానికైనా కేంద్రం యాజమానే బాధ్యత వహించాలి.         – రజిత, ఈ–డిస్ట్రిక్‌ మేనేజర్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు