కేంద్రమే నిర్వహిస్తుందా?

25 Aug, 2019 03:02 IST|Sakshi

విమోచన దినోత్సవం నిర్వహణపై బీజేపీ కార్యాచరణ 

జిల్లాల యాత్ర చేపట్టే యోచనలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో హైదరాబాద్‌ స్టేట్‌ విలీనమైన చారిత్రక సందర్భాన్ని కేంద్రమే అధికా రికంగా నిర్వహించనుందా? 1948 సెప్టెంబరు 17న జరిగిన ఈ సందర్భాన్ని కేంద్రమే జాతీయస్థాయిలో అధికారికంగా నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ స్టేట్‌లో భాగమైన కొన్ని జిల్లాలు మహా రాష్ట్ర, కర్ణాటకలో కలవగా ఆయా జిల్లాల్లో ఈరోజును అధికారికంగా నిర్వహిస్తున్న విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కేంద్రం దీన్ని నిర్వహించకపోతే పార్టీపరంగా పెద్ద ఎత్తున నిర్వహణకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కార్యాచరణను రూపొందిస్తోంది.  

టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకేనా? 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా సుముఖతను వ్యక్తం చేయనందున, తెలంగాణ సెంటి మెంట్‌ను ఉపయోగించుకుని టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు ఇదొక మంచి అవకాశంగా బీజేపీ భావిస్తోంది. ఈ విషయంలో జాతీయపార్టీ నుంచి, నాయకత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు, మద్దతు అందుతుండటంతో ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పార్టీ మరింత విస్తరించవచ్చని వ్యూహాలు, కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. వచ్చే నెల 17న కరీంనగర్‌ లేదా నిజామాబాద్‌లో నిర్వహించే హైదరాబాద్‌ విమోచన దినోత్సవాల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ రెండుచోట్లా కూడా బీజేపీ ఎంపీలు గెలవడంతో, తమ నియోజకవర్గ కేంద్రంలో సభ జర పాలని ఇరువురు ఎంపీలు పోటీపడుతున్నారు.   

ఈ ఏడాది యాత్ర? 
హైదరాబాద్‌ స్టేట్‌ విలీన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా జిల్లాల యాత్ర చేపట్టా లని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ భావిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న నిర్వహించే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో ఈ ఉద్యమంలో పాల్గొన్న వారితోపాటు కవులు, కళా కారులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ పోరాటంలో కీలకమైన భైరన్‌పల్లి ఇతర చారిత్రక ప్రదేశాల సందర్శన, ప్రాధాన్యత సంతరించుకున్న ఆయా ప్రాంతాల గురించి ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది.

>
మరిన్ని వార్తలు