అసెంబ్లీ లోక్‌సభకు వ్యత్యాసం కనిపిస్తోంది 

12 Apr, 2019 05:02 IST|Sakshi

సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో తాము పోటీచేసిన స్థానాలు, ఇతర అంశాలపై సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల స్పందన, ఇతర అంశాల్లో వ్యత్యాసం కనిపిస్తోందని చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. రెండు ఎన్నికలు ఒకేసారి రాకుండా సీఎం కేసీఆర్‌ చాకచక్యంగా వ్యవహరించి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ద్వారా గెలవగలిగారన్నారు. లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగి ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండేదని గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చాడ చెప్పారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపుడు ఉన్నంత వాడి, వేడి అటు రాజకీయపార్టీల కార్యకర్తలతో పాటు ప్రజల్లోనూ కనిపించలేదన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు కదిలించే ప్రయత్నం కూడా జరగలేదని, యువత కూడా అంత చురుకుగా పాల్గొన్న దాఖలాలు కనిపించలేదన్నారు. సీపీఐ, సీపీఎం పోటీచేసిన 4 సీట్లలో ఇరుపార్టీల మధ్య సమన్వయం, సహకారం బాగా ఉందని చెప్పారు. తాము పోటీ చేసిన స్థానాల్లోనే కాకుండా ఇతర చోట్ల కూడా బీజేపీ, టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించామన్నారు.  

పార్టీ విధానాలపై ప్రచారం: తమ్మినేని 
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సాక్షికి తెలిపారు. ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు ఎదురయ్యే విపత్కర పరిస్థితులను గురించి వివరించామన్నారు. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీచేసిన వామపక్ష పార్టీల అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో వామపక్షాల ఐక్యతను సాధించే దిశలో ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కనిపించిందన్నారు. ఎక్కడా రెండుపార్టీల మధ్య ఫిర్యాదులు చేసుకునేంత పరిస్థితి ఏర్పడలేదన్నారు. వామపక్షాలుగా పోటీ చేసిన నాలుగు స్థానాల్లో అధికార పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించినట్టు తమ్మినేని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు