మూడో విడతపైనే ఆశలు

13 Nov, 2018 11:21 IST|Sakshi

 బీజేపీ భువనగిరి టికెట్‌ కోసం ఎదురుచూస్తున్న ‘పీవీ’ 

 అధిష్టానం కాదంటే ఇండిపెండెంట్‌గా పోటీ..? 

 బరిలో ఉండాలని ఒత్తిడి చేస్తున్న క్యాడర్‌ 

 పార్టీ అభ్యర్థినే ఉంచేందుకు రంగంలోకి దిగిన సంఘ్‌పరివార్‌  

సాక్షి, యాదాద్రి : ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటికీ జిల్లాలో బీజేపీ అభ్యర్థుల ఖరారు ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలోని భువనగిరి అసెంబ్లీస్థానం నుంచి పోటీ చేయడానికి బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించనేలేదు. తొలి విడతలో మునుగోడు, మలి విడతలో ఆలేరు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ రెండు జాబితాల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావుకు చోటు కల్పించలేదు. దీంతో ఆయన మూడో జాబితాలోనైనా తనకు అవకాశం ఇస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు బీజేపీ.. యువతెలంగాణ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అ«ధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి నుంచి పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. బీజేపీ మద్దతుతో ఆయన ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగబోతున్నారు. పొత్తు విషయంలో తమను కనీసం పరిగణలోకి తీసుకోలేదని స్థానిక నాయకత్వం కినుక వహించింది. మరోవైపు భువనగిరిలో బీజేపీ అభ్యర్థిని బరిలోలోకి దించాలని సంఘపరివార్‌తోపాటు బీజేపీ కోర్‌ కమిటీ నిర్ణయించింది.

ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం పొత్తుల విషయం, స్థానిక టికెట్‌ విషయం తమతో చర్చించడం లేదని ఆ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. అయితే బీజేపీ నుంచి టికెట్‌ కోసం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తన ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక వేళ పొత్తులో భాగంగా యువతెలంగాణకు టికెట్‌ కేటాయిస్తే పీవీ ఇండిపెండెంట్‌గానైనా పోటీలో ఉండాలని బీజేపీ క్యాడర్‌ ఆయనపై ఒత్తిడి తెస్తోంది. అయితే టికెట్‌ కోసం పీవీ.. ఐదు సంవత్సరాలుగా పార్టీ నిర్మాణంతోపాటు, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ అధిస్టానానికి లేఖ రాశారు.  కాగా తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. జరుగబోతుందన్న ఉత్కంఠ నియోజకవర్గంలోని ఆ పార్టీ క్యాడర్‌లో నెలకొంది. 
ఎడతెగని సస్పెన్స్‌ ..!
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న పీవీ శ్యాం సుందర్‌రావుకు టికెట్‌ ఇవ్వడంలో నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా భువనగిరి స్థానాన్ని యువతెలంగాణ పార్టీకి కేటాయిస్తుందా, లేక తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించుతుందా అన్న చర్చ ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారింది. అయితే పీవీ పార్టీ అధ్యక్షుడిగా ఉం టూ ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో కొంతకాలంగా చాలా కార్యక్రమాలను చేపట్టారు. బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రారంభించిన మూసీ ప్రక్షాళన కోసం 30 గ్రామాల్లో చేపట్టిన 108 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. అలాగే బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ప్రారంభించిన రైతు పంచాయతీ, ఎమ్మెల్సీ రామచందర్‌రావు ప్రారంభించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించారు. బీబీనగర్‌లో అసంపూర్తిగా ఉన్న నిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యం అందించాలని ప్రజా పంచాయతీ, పోస్టుకార్డు ఉద్యమాన్ని కూడా నిర్వహించారు. నియోజకవర్గం సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు సైతం చేపట్టారు. ఎయిమ్స్‌ సాధన కోసం పెద్ద ఎత్తున పోరాడారు. ముస్లిం రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్‌ ముట్టడి కేసులో పీవీ శ్యాంసుందర్‌రావును ఐదు రోజులు జైలులో ఉంచారు. బీబీనగర్‌గా పోచంపల్లి రోడ్డు, కొండమడుగు నుంచి బొమ్మలరామారం రోడ్డు, బీబీనగర్‌ ఆర్వోబీ కోసం బొల్లేపల్లి సంగం రోడ్డు, గోపన్‌పల్లి రోడ్డుల నిర్మాణాల కోసం పాదయాత్ర చేపట్టారు.
పార్టీ కార్యక్రమాలతో ముందుకు..
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం చాలా కష్టించారు. ఇందులో భాగంగా246 బూత్‌లను ఏర్పాటు చేసి ప్రతిబూత్‌కు 25 మంది కార్యకర్తలను ఎంపిక చేశారు.65 శక్తి కేంద్రాలతోపాటు 25 వేల సభ్వత్యం పూర్తిస్థాయి జిల్లా కమిటీలను నియమించారు. భువనగిరిలో అమిత్‌షా పర్యటన సందర్భంగా దళితవాడలో సహపంక్తి భోజనాలు చేశారు. 2017లో తెలంగాణ విమోచన యాత్ర భువనగిరి నుంచే ప్రారంభించారు. 2018లో మార్పు కోసం జన చైతన్యయాత్ర భువనగిరి నుంచి ప్రారంభించారు. ఇంకాకేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, మహిళా మిలటరీ కళాశాల, పాస్‌పోర్టు కార్యాలయం, జాతీయ రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని ఆయన యోచిస్తున్నారు.    

మరిన్ని వార్తలు