ఉన‍్నది పాయో...ఉంచుకున్నది పాయో!

17 Nov, 2018 12:10 IST|Sakshi

కమలం.. కలకలం

టికెట్‌కు బదులు సస్పెన్షన్‌ 

మంథని ఆశావహుడిపై అధ్యక్షుడి వేటు 

అనుచిత వ్యాఖ్యలతోనే చర్య: కాసిపేట

కుట్రలో భాగంగానే సస్పెన్షన్‌: మేకల 

సాక్షి, పెద్దపల్లి: బీ-ఫారం కోసం ఎదురుచూస్తున్న ఆశావహుడికి అనూహ్యంగా సస్పెన్షన్‌ ఆర్డర్‌ వచ్చింది. టికెట్‌ కోసం ఉన్న పార్టీ మారితే కొత్త పార్టీలో గట్టిషాక్‌ తగిలింది. పార్టీలో చేరిన నెల రోజులు కూడా గడవకముందే ఆ పార్టీ నుంచి వేటు పడింది. మంథని నుంచి బీజేపీ టికెట్‌ ఆశిస్తున్న కమాన్‌పూర్‌ జెడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది.

అనుచిత వ్యాఖ్యలని..
టీఆర్‌ఎస్‌కు చెందిన సంపత్‌ మంథని నుంచి బీజేపీ టికెట్‌ ఆశించారు. ఇందుకోసం బీజేపీకి దరఖాస్తు చేసుకున్నారు కూడా. అవకాశం ఇస్తామనే ఖచ్చితమైన హామీతో గత నెల 24వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిత్వం తనకే ఖరారైందనే ధీమాతో శుక్రవారం సంపత్‌ హైదరాబాద్‌ పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లారు. అయితే తనపై అనుచిత వ్యాఖ్యల చేశారనే అభియోగంపై పార్టీ నుంచి కమాన్‌పూర్‌ జెడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్, మంథని పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ బోగ శ్రీనివాస్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య ప్రకటించారు. బీఫారం కోసం వేచి ఉన్న సంపత్‌కు సస్పెన్షన్‌ ఆర్డర్‌ రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో టికెట్‌ ఆశించి బీజేపీలో చేరిన జెడ్పీటీసీని ఏకంగా సస్పెండ్‌ చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మంథనిని మాత్రం పెండింగ్‌లో పెట్టింది.

ఇటీవల మూడో జాబితా ప్రకటన సందర్భంగా సంపత్‌కు దాదాపు టికెట్‌ ఖరారైందని మీడియాలో ప్రచారం జరిగింది. జాబితాలో మాత్రం పేరు కనిపించలేదు. కాని బీఫారం తనకే వస్తుందనే ధీమాతో సంపత్‌ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇరువురి సంభాషణ సాకుగా మేకలపై సస్పెన్షన్‌ వేటు వేయడంపై కమలంలో కలకలం సృష్టిస్తోంది. కాగా వేరే వ్యక్తికి టికెట్‌ ఇప్పించుకొనే కుట్రలో భాగంగానే తనను సస్పెండ్‌ చేశారని సంపత్‌ యాదవ్‌ ఆరోపిస్తున్నారు. తన సస్పెన్షన్‌ చెల్లదంటున్నారు. వివాదం ఇదీ...: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గత నెలలో కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. సభకు జనాలను తరలించేందుకు పార్టీ అందచేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ బోగ శ్రీనివాస్, సంపత్‌ యాదవ్‌ మాట్లాడుకున్న ఫోన్‌ రికార్డ్‌ ఒకటి బయటకు వచ్చింది. నియోజకవర్గానికి కేటాయించిన రూ.6 లక్షలను పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య ఖర్చు చేయలేదని, టికెట్‌ ఆశిస్తున్న మరో వ్యక్తియే భరించాడంటూ ఇరువురు మాట్లాడుకున్న సంభాషణ కలకలం సృష్టించింది. దీంతో పార్టీ క్రమశిక్షణను మీరి అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా బీజేపీ నుంచి శ్రీనివాస్, సంపత్‌ యాదవ్‌లను సస్పెండ్‌ చేస్తూ ‘కాసిపేట’ ఆదేశాలు జారీచేశారు. 

వ్యాఖ్యల కారణంగానే వేటు...
పార్టీనేతల పట్ల అనుచిత వాఖ్యలు చేసినందునే బోగ శ్రీనివాస్, మేకల సంపత్‌ యాదవ్‌లను బీజేపీ నుంచి సస్పెండ్‌ చేశాం. ఆయనకు పార్టీ టికెట్, బీ–ఫారం ఇవ్వలేదు. అమిత్‌షా పర్యటనం సందర్భంగా కేటాయించిన నిధుల వ్యవహారంలో, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా వేటు వేయాల్సి వచ్చింది.
-కాసిపేట లింగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

కుట్రపూరితంగానే సస్పెన్షన్‌
ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికి, కనీసం సంజాయిషీ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్‌ చేశారు. మంథని బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర పార్టీ ప్రకటించిన నేపథ్యంలో నన్ను సస్పెండ్‌ చేయడం శోచనీయం. పార్టీకి నష్టం కలిగించే వాఖ్యలు ఎక్కడా చేయలేదు. ఇది కేవలం కుట్ర పూరితంగా జరిగిందే. నాపై చర్యతీసుకునే అధికారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఉంది. జిల్లా అధ్యక్షుడు చేసిన సస్పెన్షన్‌ చెల్లదు. 
-మేకల సంపత్‌ యాదవ్, జెడ్పీటీసీ, కమాన్‌పూర్‌

మరిన్ని వార్తలు