సర్వశక్తులూ ఒడ్డుతున్నారు..

3 Apr, 2019 01:10 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం

ముందుండి నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌.. తోడుగా కేటీఆర్‌

సారు.. కారు.. పదహారు నినాదంతో ప్రజల్లోకి..

రాహుల్‌ సభలతో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారానికి కిక్కు

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదలతో పెరిగిన ఆశలు..  

నమో మంత్రమే బీజేపీ బలం..  

మోదీ చరిష్మా, సంస్థాగత పునాదులపై ఆశలు

ప్రభావం నామమాత్రమే అయినా ప్రచార బరిలో కమ్యూనిస్టులు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోరు హోరెత్తుతోంది. ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీ అగ్రనేతలు, దిగ్గజాలు ప్రచార పర్వంలోకి దూకి ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. సారు.. కారు.. పదహారు నినాదంతో టీఆర్‌ఎస్‌ ముందుకెళ్తుండగా.. పేదలకు కనీసం ఆదాయ పథకం, మేనిఫెస్టోపై కాంగ్రెస్‌.. మోదీ చరిష్మాపై బీజేపీలు ఆశలు పెట్టుకుని ప్రచార బరిలోకి దూకుతూ ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టుల ప్రభావం నామమాత్రమే అయినా, ఉనికి చాటుకునేందుకు కమ్యూనిస్టు పార్టీలు కూడా తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి.

సారు.. సూపర్‌ స్టారు
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఈసారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గెల్చుకోవాలని, ఎన్నికల సంకీర్ణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా కాంగ్రెస్, బీజేపీల పాలనపై విరుచుకుపడుతూ.. దేశంలో ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అని, ప్రజలు అండగా నిలిచి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేలా చూడాలని కోరుతున్నారు. బీజేపీ,కాంగ్రెస్‌ల అవగాహనా రహిత పాలన, అర్థం లేని పెత్తనం వల్ల దేశంలోని సహజవనరులను సరిగా వినియోగించుకోలేకపోతున్నామంటూ మండిపడుతున్నారు.

తన పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల గురించి చెబుతూ జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకైనా వెనుకాడనని, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలే జాతీయ ఎజెండాను నిర్ణయించడంలో ముందుండాలని చెబుతున్నారు. కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకవైపు ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరే నేతలను సమన్వయం చేసుకుంటూనే ప్రణాళిక ప్రకారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంచుకున్న నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న కేటీఆర్‌.. తన తండ్రి ఆలోచనలను, సారు.. కారు.. పదహారు నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద తండ్రీతనయుల ప్రచార వ్యూహం మిగిలిన పార్టీలతో పోలిస్తే కొంత ఉధృతంగానే సాగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నమో.. నమో.. నమో!
గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా వినిపించిన నమో మంత్రం కొంత మందగించినా, ఈ సారి ఎన్నికల్లో కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ఆ మంత్రంపైనే ఆధారపడి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మోదీ చరిష్మాకు తోడు సంస్థాగతంగా కొన్ని స్థానాల్లో ఉన్న బలంపై ఆధారపడి ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే ప్రధాన నినాదమేదీ లేకున్నా గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, అవినీతి రహిత పాలన, దేశభద్రతలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. దేశం భద్రంగా ఉండాలంటే కాపలాదారుడు మోదీకి మరోసారి అవకాశమివ్వాలని, కాంగ్రెస్‌ బూచి చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులిచ్చామని తమ ఎన్నికల ప్రచారంలో చెబుతున్న బీజేపీ నేతలు ఇతర పార్టీలను విమర్శించడం కన్నా తమ గురించి చెప్పుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారని వారి ప్రచార శైలిని బట్టి అర్థమవుతోంది.

ముఖ్యంగా సికింద్రాబాద్, మహబూబ్‌నగర్‌ స్థానాలపై గంపెడాశలు పెట్టుకున్న కమలనాథులు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న కేడర్‌ను ఉత్తేజితం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక, కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమై పోటీ చేస్తున్న వామపక్షాల ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా కనిపించినప్పటికీ, తమ ఉనికిని, కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నాల్లో ఆయా పార్టీలు కూడా తమ వంతు ప్రచారం నిర్వహిస్తూ ముందుకెళుతున్నాయి. బీఎల్‌ఎఫ్‌ను పక్కనపెట్టిన సీపీఎం ఖమ్మం జనరల్‌ స్థానంలో దళితనేత వెంకట్‌ను బరిలో దింపి ఒకప్పటి కామ్రేడ్ల కంచుకోటలో అదృష్టాన్ని పరీక్షిం చుకుంటుండటం గమనార్హం. మొత్తంమీద జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి తమకే అనుకూలంగా ఉంటుందనే అంచనాల మధ్య బీజేపీ, కాంగ్రెస్‌.. అసెంబ్లీ ఫలితాలే పునరావృతమై జాతీయ స్థాయిలో కీలకం కావాలనే ఆశలతో టీఆర్‌ఎస్‌ ఈసారి లోక్‌సభ ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నాయి.

పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌
అధికార పార్టీతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో కొంత వెనుకబడ్డట్టు కనిపించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ గత మూడు, నాలుగు రోజుల నుంచి ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఎక్కడికక్కడ స్థానిక నేతలు ప్రచారంలో స్పీడు పెంచారు. దీనికి తోడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలోని జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలు కాంగ్రెస్‌ శ్రేణులకు కిక్‌ ఇచ్చాయనే చెప్పాలి. రాహుల్‌ సభలు భారీగా కాకపోయినా అనుకున్న స్థాయిలో నిర్వహించుకోవడం, ఆయన మాటలు ప్రజల్లోకి బలంగానే వెళ్లాయనే అంచనాతో ప్రచారంలో ఊపు పెంచారు. ఢిల్లీలో విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోపై కూడా పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నట్లు కన్పిస్తోంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా హమ్‌ నిభాయేంగే (మేం చేసి తీరుతాం) పేరుతో విడుదలయిన మేనిఫెస్టో మేలు చేస్తుందనే భావనలో ఉన్నారు. కనీస ఆదాయ హామీ పథకంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యాపారాలు పెట్టుకునేందుకు కల్పించిన వెసులుబాటు లాంటి అంశాలు కూడా ఎన్నికల్లో లాభిస్తున్నాయని భావిస్తున్నారు. మొత్తంమీద పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ను ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎక్కువ సీట్లలో పాగా వేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ శ్రేణులు ప్రచారం చేస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు