మద్యం నియంత్రణకు చర్యలు చేపట్టాలి

7 Feb, 2017 02:56 IST|Sakshi
మద్యం నియంత్రణకు చర్యలు చేపట్టాలి

ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం అమ్మకాల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వపరంగా పది రోజుల్లో కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కానున్నట్లు హెచ్చరించింది. సోమవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్కువద్ద నిర్వహించిన ధర్నాలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బెల్ట్‌ షాపులను వెంటనే తొలగించాలని.. బడి, గుడి, కళాశాలల సమీపంలోని దుకాణాలను ఎత్తేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మద్యంపై పన్నులు, లైసెన్స్‌ల ద్వారా ప్రభుత్వానికి రూ.14 వేల కోట్లు సమకూరుతున్నాయని, మొత్తం రూ.35 వేల కోట్ల మద్యం అమ్మకాల్లో రూ.30 వేల కోట్లు పేదలే కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రజల వద్దకు పాలన ఏమోగాని ప్రజల మధ్యకు మద్యాన్ని ఎంతో శ్రద్ధగా ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో 15 గంటల పాటు బార్లు, మద్యం షాపులు తెరిచి ఉండటంతో, రోజుకు 30వేల మంది విద్యార్థులు కాలేజీలు మాని అక్కడే ఉంటున్నారన్నారు. మద్యం నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోకపోతే మహిళల ఆగ్రహానికి గురికావా ల్సి వస్తుందని మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు