కమలదళం కదన వ్యూహం

20 Oct, 2018 11:42 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లే లక్ష్యంగా కమలదళం చాప కింద నీరులా దూసుకెళ్తోంది. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా పని కానిచ్చేస్తోంది. పలు సర్వేల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీకి పార్టీకి ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి పట్టు పెంచుకోవడంతో పాటు గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీకి చెందిన అనుబంధ విభాగాలు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాయి.

అంతేకాదు పక్కన ఉన్న కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి పాలమూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు. అలాగే కర్ణాటక నుంచి భారీగా తరలివస్తున్న బీజేపీ కార్యకర్తలను ఒక్కో నియోజకవర్గానికి అవసరాలకు అనుగునంగా 50 నుంచి 100 మందిని కేటాయిస్తున్నారు. వారంతా కూడా స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక పార్టీ బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో పకడ్బందీ చర్యలు చేపడుతోంది. పలు సర్వేల నివేదికల ఆధారంగా బలమైన నేతల కోసం గాలం వేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి పార్లమెంటరీ బోర్డుకు సమర్పించారు. ఈ జాబితా ప్రకటించడం నేడో, రేపో లాంఛనంగా ప్రకటించే అవకాశముంది. ఇక మహాకూటమి అభ్యర్థులు తేలాక టికెట్‌ దక్కని వారిని కూడా పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనతో వెళ్తోంది.

పట్టు ఉన్న స్థానాలపై గురి 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి ముందు నుంచి కాస్త పట్టు ఉంది. కొన్ని నియోజకవర్గాలలో పటిష్టమైన ఓటు బ్యాంకును కమల దళం  కలిగిఉంది. ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి కాస్త భిన్నమైన శైలిని ప్రదర్శించి మరింత ఓటు బ్యాంకు సాధించి గెలుపు బావుటా ఎగురవేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రతీ పార్లమెంట్‌ పరిధిలో నాలుగు నియోజకవర్గాలపై గట్టి ఫోకస్‌ పెడుతోంది. వీటిలో కనీసం రెండు స్థానాలైనా గెలవాలనేది బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది.

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి, వనపర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించింది. వీటిలో కనీసం రెండు స్థానాలైనా గెలుపొందాలని భావిస్తోంది. అలాగే, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో కూడా నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర నియోజకవర్గాలపై దృష్టిపెట్టింది. వీటిలో ఇది వరకే మహబూబ్‌నగర్‌లో గెలుపొందిన చరిత్ర ఉండడం, మిగతా నారాయణపేట, మక్తల్‌లో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండటంతో గెలుపుపై బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు 
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పలు సర్వేలను ప్రామాణికం చేసుకొని ఎంపిక చేయాలని భావిస్తోంది. మహాకూటమి అభ్యర్థుల ప్రకటన కొలిక్కి వస్తే... అక్కడ ఉండే అసంతృప్తులకు సైతం గాలం వేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లోపోటీలో ఒక్కరే ఉండగా.. మరికొన్ని నియోజకవర్గాలలో ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహులు పోటీ పడుతున్నారు.

ఈ మేరకు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి, అచ్చంపేట నుచి మల్లీశ్వర్‌తో పాటు గద్వాల నుంచి టికెట్‌ రేసులో ఉన్న రాజా వెంకటాద్రిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి నుంచి వెంకటాద్రిరెడ్డి పేరును ఖరారు చేసి పార్లమెంటరీ బోర్డుకు పంపించింది. అలంపూర్‌లో సైతం రజినీరెడ్డి పార్టీ ఆదేశాల మేరకు ప్రచారంలో నిమగ్నం కాగా.. వనపర్తి నుంచి వనపర్తిలో అమరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఇక మహబూబ్‌నగర్‌ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నారాయణపేట నుంచి రతంగ్‌ పాండురెడ్డి పేరు ఖరారు

చేయగా.. దేవరకద్ర నుంచి ఎగ్గని నర్సింహులు, వర్కటం జగన్నాథరెడ్డి పోటీ పడినా అధిష్టానం నర్సింహులు వైపే మొగ్గు చూపి పేర్లను రాష్ట్ర పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపించింది. కాగా, కొడంగల్‌ నుంచి నాగూరావ్‌ నామాజీ బరిలో నిలపాలని భావిస్తున్నప్పటికీ మరోవైపు మక్తల్‌ నుంచి కూడా ఆయన పేరును పరిశీలించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, పడాకుల బాల్‌రాజు, పాండురంగారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక జడ్చర్ల నుంచి రామ్మోహన్, వీరబహ్మచారి, ఆర్‌.శ్రీనివాస్‌ రేసులో ఉన్నారు.  

భిన్నమైన ప్రచారశైలి 
ఈసారి తప్పనిసరిగా కొన్ని స్థానాలను ఖచ్చితంగా గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ... కాస్త భిన్నమైన శైలితో ప్రచారంలో ముందుకెళ్తోంది. ఇప్పటికే పార్టీ అనుబంధంగా ఉండే సంఘాలు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాయి. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా కాస్త సీరియస్‌గా తీసుకొని నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన శక్తి కేంద్రాల ద్వారా పోలింగ్‌ బూత్‌ స్థాయికి కేంద్రప్రభుత్వ పథకాలను తీసుకువెళ్తున్నారు. శక్తి కేంద్రాల్లో ఒక్కో వ్యక్తికి పది కుటుంబాలను కేటాయించారు.

సదరు శక్తి కేంద్రంలోని సభ్యుడు సాధ్యమైనంత మేర ఓట్లను మళ్లించేలా చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్న బీజేపీ కర్ణాటకకు చెందిన ప్రజాప్రతినిధులను పరిశీలకులుగా నియమించింది. ఫోకస్‌ పెట్టిన నియోజకవర్గానికి ఇద్దరేసి చొప్పున కన్నడ ఎమ్మెల్యేలను కేటాయిస్తున్నారు. అలాగే కర్ణాటక నుంచి భారీగా వస్తున్న కార్యకర్తలను కూడా ఒక్కో నియోజకవర్గానికి 50 నుంచి 100 మందిని కేటాయిస్తున్నారు. తద్వారా పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఫలితాలను రాబట్టాలని భావిస్తోంది.   

మరిన్ని వార్తలు