పట్టు దిశగా కమలం అడుగులు

14 Sep, 2019 12:35 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలో పట్టు సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుని ఊపుమీదున్న కమలదళం.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను పకడ్బదీంగా అమలు చేస్తోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు, ఏకంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలపైనే బీజేపీ గురి పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.టీఆర్‌ఎస్‌కు చెందిన బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అమేర్‌.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే.

టీఆర్‌ఎస్‌ పార్టీలోని అసంతృప్తి నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో షకీల్‌ అమేర్‌ అర్వింద్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆర్మూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకురాలు ఏలేటీ అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్‌రెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అనుచరులు బీజేపీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈనెలాఖరులో గానీ, వచ్చేనెలలో గానీ ఆమె బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డితో కూడా బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌ వంటి నాయకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధినాయత్వం ప్రయత్నిస్తోంది.

ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనా బీజేపీ దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలే కాకుండా, మండల స్థాయిలో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతం అవ్వాలని యోచిస్తోంది. ఇటీవల నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్‌ అనుచరవర్గం దాదాపు మొత్తం కాషాయ కండువా కప్పుకుంది. అలాగే ఆర్మూర్‌ వంటి నియోజకవర్గంలోనూ వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలకు బీజేపీ వలవేస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్‌ను పెంచుకోవడం ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలవుతుందని భావిస్తోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు