బీజేపీవాళ్లు ఎన్నికల హిందువులు

6 Apr, 2019 04:00 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు 

ఎన్నికలు రాగానే వారికి మందిరం గుర్తొస్తుంది 

మందిరం, మసీదు గోల కాదు, సామాన్యుల సంక్షేమం ముఖ్యం 

టీఆర్‌ఎస్‌లో చేరిన మున్నూరుకాపు సంఘం నేతలు 

సాక్షి, హైదరాబాద్‌:  మనం అందరం హిందువులమైతే..బీజేపీవాళ్లు ఎన్నికల హిందువులు, రాజకీయ హిందువులని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఎద్దేవా చేశా రు. ఎన్నికలు రాగానే బీజేపీ రామమందిరం గురించి మాట్లాడుతుందని, మందిరం, మసీదుల గోల కాకుండా సామాన్యుల సంక్షేమం ముఖ్యం కావాలన్నారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, మహిళా అధ్యక్షురాలు అల్లాడి గీతారాణితోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల సంఘం అధ్యక్షకార్యదర్శులు, సభ్యులు తెలంగాణ భవన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానిగా మోదీ చేసిందేమిటో చెప్పుకోలేక మతరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు మోదీకి చాయ్‌వాలా నుంచి చౌకీదార్‌గా ప్రమోషన్‌ వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ఇప్పుడు కూడా గరీబీ హటావో అంటున్నారనీ, ఆయ న తాత, నానమ్మ, తండ్రి కూడా ఇవే మాట లు చెప్పారన్నారు. ఇప్పుడు పిల్లలకు పరీక్ష లున్నాయని, రాజకీయ పార్టీలకు కూడా ఈ నెల 11 న పరీక్ష ఉందని చమత్కరించారు. ఎన్నికల పరీక్షలో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.  

రెండో హరిత విప్లవానికి బీజం 
‘ప్రభుత్వ గోదాముల సామర్థ్యాన్ని ఆరు రెట్లు పెంచిన ఘనత కేసీఆర్‌దే. తెలంగాణలో రెండో హరిత విప్లవానికి కేసీఆర్‌ బీజం వేశా రు. సాగునీటి ప్రాజెక్టులతో 1.20 కోట్ల ఎకరాలకు నీరందించడమే కేసీఆర్‌ లక్ష్యం. రెండు, మూడేళ్లలో ఇది సాధ్యమవుతుంది. సాగునీరే కాదు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించే కార్యాచరణ కేసీఆర్‌ దగ్గర ఉంది. మన రైతుబంధును కూడా మోదీ కాపీ కొట్టారు. రైతుబంధు దేశానికి ఆదర్శమైంది. కేసీఆర్‌ నిర్ణయించే సర్కారు ఢిల్లీలో రావాలంటే టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లు ఇవ్వాలి. సారు, కారు, ఢిల్లీలో మనం చెబితే ఏర్పడే సర్కారు ఇదే మన నినాదం. టీఆర్‌ఎస్‌లో మున్నూరుకాపులకు ప్రాధా న్యత ఇచ్చాం.

మున్నూరుకాపు కులానికి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. స్థానిక సంస్థల్లోనూ ప్రాధా న్యత ఇచ్చింది. ఇప్పుడూ ఇస్తుంది. మున్నూ రు కాపులను ఆదుకునేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తాం. మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా. టీఆర్‌ఎస్‌లో చేరుతున్న అందరికీ స్వాగతం. మున్నూరుకాపు సభ్యులు టీఆర్‌ఎస్‌ తమది అని ధైర్యంగా చెప్పుకోవాలి’అని కేటీఆర్‌ అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు.

తెలంగాణ మోడల్‌పై దేశమంతా చర్చ 
‘ఒకప్పుడు దేశంలో పశ్చిమబెంగాల్, గుజరాత్‌ మోడల్‌ అంటూ చర్చ జరిగేది. ఇప్పుడు తెలంగాణ మోడల్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి మోడల్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. మోదీ 2014లో చాయ్‌ పే చర్చ అన్నారు. ఇప్పుడు కేసీఆర్‌ తెచ్చిన రైతుబంధు, రైతుబీమాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 24 గంటల కరెంటు తెలంగాణలో ఇస్తారని ఎవరైనా ఊహించారా? కేసీఆర్‌ వల్లే అది సాధ్యమైంది. ఉమ్మడి ఏపీలో కరెంటుకు, నీళ్లకు, ఎరువులకు అన్నిటికీ కష్టాలే ఉండేవి. ఇప్పుడు అన్ని కష్టాలు తొలగుతున్నాయంటే అది కేసీఆర్‌ వల్ల కాదా? కరెంట్‌ గురించి అన్ని పార్టీలు ఆందోళన చేసే పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు ఉందా? తెలంగాణలో రైతులకు దిగులు లేకుండా చేయడమే కేసీఆర్‌ ధ్యేయం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు