టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు!

20 Oct, 2019 16:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం  దేశంలో మరెక్కడా లేదు. 48 వేలమంది ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై చొరవ చూపాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడంలేదు. కార్మిక సంఘాలను ఎలాంటి చర్చలకు ఆహ్వానించపోగా.. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఉన్నారు.

ఆర్టీసీ కార్మికుల పోరాటంలో బీజేపీ చివరి వరకు ఉంటుంది. శనివారం రోజున ఆర్టీసీ కార్మికుల బంద్‌లో పాల్గొన్న బీజేపీ నాయకులు లక్ష్మణ్‌తో పాటు చాలామంది ని అరెస్ట్ చేశారు. కార్మికుల పక్షాన పోరాటం చేసే వాళ్లను ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయలేదని, కావాలంటే టీఆర్‌ఎస్‌ నాయకులు విచారించుకోవచ్చని' అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల గురించి ప్రస్తావించగా బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నట్లు' ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు