తక్షణమే ఢిల్లీకి రండి, లక్ష్మణ్‌కు హైకమాండ్ పిలుపు

2 Nov, 2019 12:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. తక్షణమే ఢిల్లీకి రావాలని  ఆదేశాలు అందటంతో ఆయనకు శనివారం హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 29వ రోజుకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఆర్టీసీ సమ్మెపై లక్ష్మణ్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కూడా ఆయన కలవనున్నారు. 

కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. అలాగే ఎంపీ బండి సంజయ్‌ విషయంలో పోలీసుల ఓవరాక్షన్‌పై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. తాజా పరిణామాలతో లక్ష్మణ్‌ వెంటనే ఢిల్లీ రావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆయన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ తదితరులు శనివారం ఉదయం కలిశారు. ఆర‍్టీసీ కార్మికుల సమ్మె, భవిష్యత్‌ కార్యాచరణపై లక్ష‍్మణ్‌తో చర్చించారు.

మరోవైపు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి వీ హనుమంతరావు (కాంగ్రెస్), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), మోహన్ రెడ్డి (బీజేపీ) ఎంఎల్ పార్టీ నేత పోటు రంగారావు, ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి వీఎస్‌ రావు తదితరులు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. 

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.  ఆర్టీసీ సమ్మె సహా మరో 30 అంశాల ఎజెండాపై చర్చించనుంది. ఆర్టీసీ సమ్మె 29 రోజులకు చేరిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది. 

చదవండి: ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు?

మరిన్ని వార్తలు