చదువుకుందాం కాస్తా చదువుకొందాంగా మార్చారు : లక్ష్మణ్‌

12 Jun, 2019 12:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మజ్లీస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. ‘చదువుకుందాం’ నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ వస్తే కామన్‌ స్కూల్‌ విధానం తీసుకోస్తానని కేసీఆర్‌ ప్రగల్భాలు పలికాడన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని తెలిపారు. ఫీజుల నియంత్రణ లేదు.. కార్పొరేట్‌ విద్యావిధానానికి పెద్ద పీట వేశారని ఆరోపించారు. ఫీజుల కలెక్షన్‌ విషయంలో దేశంలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 400 శాతం ఫీజు పెంపు జరిగిందని పేర్కొన్నారు.

విద్యాసంస్థలు 5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న రూల్‌ని అతిక్రమించి దాదాపు 70 శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలున్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డిటెన్షన్‌ చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుండటం ఆందోళనకరం అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తోన్న పాఠశాలల వివరాలలు తమ దగ్గర ఉన్నాయని.. వారంలోగా వారు సర్దుకోకపోతే.. వాళ్ల పని పడతామని లక్ష్మణ్‌ హెచ్చరించారు. అలయన్స్‌ పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకోవడం సిగ్గు చేటన్నారు.

మరిన్ని వార్తలు