అన్నీ ఉత్త మాటలే!

16 Mar, 2017 02:00 IST|Sakshi
అన్నీ ఉత్త మాటలే!

ఇది కేవలం బడాయి బడ్జెట్‌: కిషన్‌రెడ్డి
తప్పుడు లెక్కలతో మభ్యపెడుతున్నారు
ప్రజలను మద్యానికి బానిసలు చేస్తారా?
బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణగా మార్చారని విమర్శ
అభివృద్ధి కోసమే అప్పులు: ఈటల  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ మాటలు తీపి, చేతలు మాత్రం చేదు అన్నట్లుగా ఉందని బీజేపీ పక్షనేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కోతలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని.. ప్రభుత్వం ప్రవేశపెట్టినది కేవలం బడాయి బడ్జెట్‌ మాత్రమేనని మండిపడ్డారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ‘‘గతేడాది ప్రణాళిక పద్దు కింద రూ.67 వేల కోట్లు చూపిన ప్రభుత్వం.. డిసెంబర్‌ నాటికి రూ.34 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

మిగతా మూడు నెలల్లో మరో రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినా మొత్తం రూ.46 వేల కోట్లు దాటదు. అలాంటప్పుడు తప్పుడు లెక్కలతో ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు..?’’అని ప్రశ్నించారు. ప్రజలను మద్యానికి బానిసలుగా చేసేలా బడ్జెట్‌ ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు. బార్లు, మద్యం దుకాణాల నుంచి ఫీజుల ద్వారా రూ.9 వేల కోట్లు, మద్యం అమ్మకాలపై పన్నుల రూపంలో మరో రూ.10 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం చెబుతోందని.. ఇది ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చే, యువశక్తిని నిర్వీర్యం చేసే ప్రయత్నమేనని మండిపడ్డారు.

అన్నీ అవాస్తవాలే..
హోంగార్డుల జీతాలను రెండు సార్లలో రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని బడ్జెట్‌లో పేర్కొనడంపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అప్పటికే రూ.9 వేలుగా ఉన్న జీతాలను రూ.12 వేలకు పెంచారని.. కానీ 6 వేల నుంచి 12 వేలకు పెంచినట్లు అవాస్తవాలు పేర్కొన్నారని చెప్పారు. ఈ విషయం తప్పయితే తాను వెంటనే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. ఇక సబ్సిడీ ట్రాక్టర్లను కేవలం గులాబీ చొక్కాల (టీఆర్‌ఎస్‌ నేతల) వారికే కట్టబెట్టారని ఆరోపించారు.

కేవలం పార్టీలు మారినందుకు ఓ మండలంలో కొందరికి ఈ తాయిలం ఇచ్చారంటూ కిషన్‌రెడ్డి కొన్ని పేర్లు చదివారు. ఈ అంశంపైనా తాను చర్చకు సిద్ధమని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. గొర్రెల పంపిణీకి కేంద్ర సహకార అభివృద్ధి సంస్థ ద్వారా నిధులిస్తున్నా... కనీసం ప్రధాని మోదీ పేరు ఎత్తలేదని పేర్కొన్నారు. కానీ గొర్రెలతో, గొంగళ్లు కప్పుకుని ఫోటోలు మాత్రం దిగారని... ఇప్పటికైనా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి గొర్రె, గొంగడి తీసుకెళ్లాలని సూచించారు.

టెండర్లలో అవకతవకలు
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లలో అనేక అవకతవకలు జరిగాయని.. అర్హతలేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రూ.30 వేల కోట్ల పనులు కట్టబెట్టారంటూ అందుకు సంబంధించిన పత్రాల కాపీలను డిప్యూటీ స్పీకర్‌కు అందించారు. ప్రభుత్వం సైతం టెండర్‌ డాక్యుమెంట్లను స్పీకర్‌ ముందు పెట్టాలని కోరారు.

బాకీల తెలంగాణగా మారుస్తున్నారు
రాష్ట్ర అప్పుల అంశాన్ని కిషన్‌రెడ్డి ప్రస్తావిస్తూ.. 2014–15లో రాష్ట్ర అప్పు రూ.61 వేల కోట్లుంటే, 2015–16 నాటికి రూ.93 వేల కోట్లకు, 2016–17 నాటికి రూ.1.14 లక్షల కోట్లకు, 2017–18కి 1.40 లక్షల కోట్లకు చేరుతోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.42 వేల చొప్పున అప్పు మోపారని పేర్కొన్నారు. కేవలం వడ్డీల రూపంలోనే ఏటా రూ.11 వేల కోట్లు కట్టే దుస్థితి వచ్చిందని... ఇది బంగారు తెలంగాణా? లేక బాకీల తెలంగాణా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వివిధ కార్పొరేషన్ల పేరిట సైతం రూ.31,453 కోట్లు అప్పులు చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు.

గొప్ప రాష్ట్రంగా చేయాలనే అప్పులు: ఈటల
కిషన్‌రెడ్డి లేవనెత్తిన అంశాలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమా ధానమిచ్చారు. అప్పులు చేయని రాష్ట్రాలు ఉండవని, తెలంగాణను గొప్ప రాష్ట్రంగా చేయాలంటే అప్పులు తప్పవని పేర్కొన్నారు. ‘ప్రజల అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నాం. కరెంట్‌ ఇవ్వాలన్నా, నీళ్లు పారాలన్నా అప్పులు కావాల్సిందే. అప్పులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమో కిషన్‌రెడ్డి చెప్పాలి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే రుణాలు తీసుకుంటున్నాం. రాష్ట్ర జీఎస్‌డీపీ మీద ఆధారపడే రుణాలు వస్తాయి. కావాలని అప్పులు చేయాలన్న ఆలోచన మాకు లేదు.’ అని చెప్పారు. గొర్రెలకు కేంద్రం ఇస్తున్న నిధులపై స్పందిస్తూ... కేంద్రం 20 శాతం నిధులే ఇస్తోందని, 35 శాతానికి పెంచేలా కృషి చేయాలని కిషన్‌రెడ్డికి సూచించారు.

మరిన్ని వార్తలు