‘ప్రజాప్రతినిధిని రక్తమోడేలా కొట్టడం దారుణం..’

20 Jun, 2019 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఒక ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం అమానుషమని, ప్రజాప్రతినిధిని రక్తమోడేలా కొట్టడం దారుణమని ట్విటర్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజా పాలన ఉందా.. రజాకార్ల పాలన కొనసాగుతుందా..? అని ధ్వజమెత్తారు. 

'పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను వారి నివాసంలో పరామర్శించాను. వారు నిన్న రాత్రి జరిగిన సంఘటనను వివరించారు. రాజాసింగ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకుంటే.. ఇక సామాన్యులకు పరిస్థితి ఏంటి. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు తెగబడుతుంది. దాడులతో బీజేపీని భయపెట్టాలనుకుంటే కుదరని పని. త్యాగాలతో ఎదిగిన చరిత్ర బీజేపీది. రాజాసింగ్‌పై దాడికి పాల్పడిన గోషామహల్ ఏసీపీ ఎం.నరేందర్, అసిఫ్ నగర్ ఏసీపీ నర్సింహా రెడ్డి, షాయనాత్ గంజ్ ఎస్సై గురుమూర్తి, రవి కుమార్‌లపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జరిగిన ఘటనపై పోలీస్ యంత్రాంగం బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు